Vice President Election: అనారోగ్య కారణాలతో ఈ మధ్యే ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఈ అనూహ్య పరిణామంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ(Bjp) రాజీనామా చేయించిందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాలకు చెందిన నేతను ఎన్నుకునేందుకే మోదీ ఇలా చేశారని రాజకీయ వర్గాలు తెగ మాట్లాడుకున్నాయి. చివరకు ఆ అంచనానే నిజమైంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న తమళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసింది. అయితే, ప్రతిపక్ష కూటమి ప్రతిగా డీఎంకే నుంచి అభ్యర్థిని ప్రకటిస్తుందనే ప్రచారం జరుగగా, ఆ అంచనాలకు భిన్నంగా తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది.
Also Read: CM Revanth Reddy: యూరియా విషయంలో పత్తా లేని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు
టీడీపీ, డీఎంకే కీలకం
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, డీఎంకే పార్టీలే కీలకం కానున్నాయి. బీజేపీ(Bjp)తో పొత్తు కారణంగా టీడీపీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్CP Radhakrishnan)కు మద్దతు తెలిపింది. ఇప్పుడు ప్రతిపక్ష కూటమి తెలుగు వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయత విషయంలో నిక్కచ్చిగా ఉండే డీఎంకే పార్టీ కూడా సందిగ్ధంలో పడింది. ఎన్డీఏ అభ్యర్థి తమిళ వ్యక్తి కావడంతో ఏం చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలు పైకి ఎలా ప్రకటించినా ఓటింగ్ సమయంలో నేతలు ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఓట్ల షఫిలింగ్ తప్పదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్
సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన ఉస్మానియాలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1971లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సిటీ సివిల్ కోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టులో పలు కేసులు వాదించారు. 1988 నుంచి 1990 మధ్య హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పని చేశారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లపాటు అక్కడే పని చేశారు. 2011 జూలై 8న పదవీ విరమణ పొందారు. రిటైర్ అయ్యాక గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. 2024 డిసెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.
రాధాకృష్ణన్ ప్రొఫైల్
సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. పూర్తిపేరు పొన్నుసామి రాధాకృష్ణన్. బీబీఏ పట్టభద్రుడైన సీపీ, కాలేజీ రోజుల్లో టేబుల్ టెన్నిస్, అథ్లెట్‌గా పేరు పొందారు. 1996లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి లక్షన్నర ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. తమిళనాట బీజేపీకి ఇదే గర్వించదగ్గ విజయంగా చెబుతుంటారు. ఆ సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, పార్లమెంటరీ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన ప్రత్యేక కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2004 లోక్ సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేతో కూటమిని ఖరారు చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకున్నా కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి 3.8 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2024 మార్చి 20 నుంచి జూలై 30 దాకా తెలంగాణ గవర్నర్‌గా పని చేశారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు.
బలాబలాలు
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఖాళీలు పక్కనపెడితే ప్రస్తుతం 782 మంది సభ్యులు
అభ్యర్థి గెలవాలంటే 382 ఓట్లు కావాలి