Rajasthan Road Accident: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఏడుగురు పిల్లలు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని పికప్ వ్యాన్ ఢీకొట్టడం.. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారని వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
దౌసా జిల్లా (Dausa district) ఎస్‌పీ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఏటా జిల్లాకు చెందిన బాధితులు.. ఖాతు శ్యామ్ (Khatu Shyam), సలాసర్ బాలాజీ (Salasar Balaji temple) దేవాలయాలను దర్శించి తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఉదయం 4-5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది పిల్లలు, 4 మంది మహిళలు మృతి చెందారని జిల్లా ఎస్‌పీ ధ్రువీకరించారు. పూర్వి (3), దక్ష్ (12), సీమ (25), ప్రియాంక (25), అంషు (26), సౌరభ్ (28), శీలా (35) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు.
#WATCH | Dausa, Rajasthan | Visuals from Shri Ramkaran Joshi Hospital in Dausa, where people injured in the accident between a passenger pick-up and a trailer truck near Bapi have been brought for treatment. pic.twitter.com/0ytIMiV7T8
— ANI (@ANI) August 13, 2025
పికప్ వ్యానులో 20 మంది
ప్రమాద సమయంలో పికప్ వ్యాన్ (Pickup Vehicle)లో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్‌పీ సాగర్ (Dausa Superintendent of Police) తెలిపారు. హైవే సర్వీస్ లేన్ (Service lane of the highway) లో నిలిపి ఉన్న ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ 8మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పీ తెలిపారు.
రాజస్థాన్ సీఎం సంతాపం
మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి (Rajasthan Chief Minister) భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘దౌసాలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం కలిగిన వార్త చాలా బాధాకరం. గాయపడిన వారికి తక్షణ, సముచిత వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాం. మరణించిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతి చేకూర్చాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని సీఎం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు ఇతర నేతలు కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.
యూపీ సీఎం ఏమన్నారంటే?
రాజస్థాన్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారంతా యూపీ వారే కావడంతో ఆ రాష్ట్ర సీఎం (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను యోగి ఆదేశించినట్లు సీఎంఓ కార్యాలయం (U.P. CMO) ఒక ప్రకటనలో తెలియజేసింది.
Also Read: YS Jagan: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్.. కూటమి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్!
గతంలోనూ ఇంతే..!
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) ప్రమాద ఘటనపై స్పందిస్తూ కేంద్రం సాయం కోరారు. సరిగ్గా ఆ ప్రాంతంలోనే గతంలోనూ చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ‘ఇంత పెద్ద ఘటన అరుదు. కానీ ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రదేశాన్ని పునర్నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత నిధి కేటాయించాలని మేము కోరుతున్నాము’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.