PSLV C62 Satellites: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ62 వాహన నౌకను ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం ప్రయోగించారు. భూపరిశీలనకు ఉద్దేశించిన ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలు, యూనివర్సిటీలకు చెందిన మొత్తం 16 శాటిలైట్స్‌ను మోసుకెళ్తూ రాకెట్‌లో (PSLV C62 Satellites) నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి రెండు దశలు అద్భుతంగా పనిచేసిన రాకెట్.. మూడవ దశలో క్రమరాహిత్యం ఏర్పడింది. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణమైన వేగంతో ప్రయాణించలేకపోయింది. దీంతో, నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు చేరలేకపోయాయి. మరి, ఆ 16 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఏమయ్యాయి?, అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
భూ వాతావరణంలో దగ్దం
ప్రయోగం విఫలం కావడంతో గురుత్వాకర్షణ ప్రభావం పనిచేసి, సోమవారం సాయంత్రానికే, పీఎస్‌ఎల్‌వీ రాకెట్ పైభాగం, ఉపగ్రహాలు భూవాతావరణంలోకి ప్రవేశించాయి. అయితే, చాలా మందంగా ఉండే భూవాతావరణతో రాపిడి జరిగి తీవ్రమైన వేడికి శాటిలైట్స్ అన్నీ మండిపోయి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కలు మాదిరిగానే భూవాతావరణంలోకి వచ్చి పేలిపోయి మండిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా చిన్న ముక్కలు మిగిలి ఉన్నా, వాటితో ఎలాంటి హాని ఉండదని, అవి సముద్రంలో పడిపోయే అవకాశం ఉందని వివరించారు.
పీఎస్ఎల్వీ చరిత్రలో 4వ వైఫల్యం
ఇస్రోకి అత్యద్భుతమైన సక్సెస్ ట్రాక్ రికార్డు ఉంది. ఇక, పీఎస్ఎల్‌వీ సుదీర్ఘ చరిత్రలో ఇది కేవలం నాలుగో ఫెయిల్యూర్ మాత్రమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, వరుసగా ఇది రెండో వైఫల్యం కావడం శాస్త్రవేతల్లో నిరాశ నింపింది. 2025లో పీఎస్‌ఎల్‌వీ-సీ61 కూడా విఫలమైంది. ఈ ప్రయోగంలో కూడా మూడవ దశలోనే సమస్య తలెత్తింది. ఈ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఇస్రో ఇప్పటికే ఒక టీమ్‌ని ఏర్పాటు చేసింది. థ్రస్ట్‌లో వ్యత్యాసం, ప్రెజర్ సమస్య వంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. కాగా, అంతరిక్ష ప్రయోగాలు చాలా సంక్లిష్టమైనవి. చిన్నపాటి తేడా వచ్చినా తీవ్ర నష్టానికి దారితీస్తుంది.
Read Also- DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ సంక్రాంతి కానుక.. 3.64 డీఏ శాతం పెంపు
పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం ఎందుకంటే?
పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ సోమవారం ఉదయం 10.18 గంటల సమయంలో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 16 శాటిలైట్స్‌ను మోసుకెళ్లగా ఇందులో ఈవోఎస్-ఎన్1 (EOS-N1) ప్రధానమైనది. దీనిని అన్వేష్ అని కూడా శాస్త్రవేత్తలు పిలిచారు. రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మ్యాపింగ్ కోసం ఉపయోగపడేలా భూపరిశీలన కోసం ఈ మిషన్‌ను రూపొందించారు. మిగతా శాటిలైట్స్ విషయానికి వస్తే, భారత్‌కు చెందిన కొన్ని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, నేపాల్, థాయిలాండ్, యూరప్ వంటి అంతర్జాతీయ భాగస్వాములకు చెందిన సుమారు 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంతరిక్షంలో శాటిలైట్స్‌కు ఇంధనం నింపడం, సురక్షితంగా రీఎంట్రీ క్యాప్సూల్స్ వంటి ప్రయోగాత్మక పరికరాలను కూడా ప్రయోగించారు.
రాకెట్ చలనంలో మొదటి రెండు దశలు అద్భుతంగా పనిచేశాయి. ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాల పాటు అంతా సవ్యంగా అనిపించింది. సక్సెస్ ప్రకటన రావడమే తరువాయి అని అంతా భావించారు. కానీ, మూడవ దశ, అంటే ఘన ఇంధన మోటార్ చివరలో సమస్య తలెత్తింది. రాకెట్ ఊహించని రీతిలో తిరగడం ప్రారంభించిందని, అందుకే, నిర్ణీత మార్గం నుంచి పక్కకు తప్పుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు.

