Modi Manipur visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో (Modi Manipur visit) పర్యటించారు. 2023లో కుకీ-మైతేయ్ తెగల మధ్య తీవ్ర హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకున్న తర్వాత తొలిసారి ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాసులకు మోదీ కీలక సందేశం ఇచ్చారు. అయితే, ప్రధాని మణిపూర్ పర్యటన సందర్భంగా అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మోదీ మణిపూర్ రాజధాని ఇంఫాల్ పట్టణానికి చేరుకున్న సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది.
పర్యటన షెడ్యూల్‌లో భాగంగా మొదట ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి ‘పీస్ గ్రౌండ్’కు మోదీ చేరుకొని సభలో మాట్లాడారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం, మణిపూర్ సంస్కృతికి, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన కంగ్లా కోట సందర్శనకు వెళ్లారు. అక్కడి నుంచి కుకీ-జో ప్రజలు ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతమైన చురాచంద్‌పూర్‌కు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్లడం సురక్షితం కాదని భద్రతా అధికారులు ప్రధాని మోదీకి తెలిపారు.
ర్యాలీ వేదిక వద్దకు చేరుకోవడానికి రోడ్డు మార్గం ఒక్కటే పరిష్కారమని, అందుకు సుమారుగా ఒకటిన్నర గంటల సమయం పడుతుందని సమాచారం ఇచ్చారు. రిస్క్ అయినప్పటికీ, వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్డు మార్గాన కార్యక్రమం వద్దకు వెళ్లాలని మోదీ నిర్ణయించుకున్నారు. జోరు వాన కురుస్తుండగా కారులో అక్కడికి వెళ్లారు. మణిపూర్ ప్రజలను ముఖాముఖి కలిసి మాట్లాడాలనే నిశ్చయంతో ఉన్న మోదీ, ఎంత సమయం పట్టినా తాను వెళ్లాల్సిందేనని స్పష్టంగా చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని చెప్పినట్టుగానే కారు కాన్వాయ్‌లో వెళ్లి అక్కడి జనాలతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు.
Read Also- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!
చురాచంద్‌పూర్‌లో కీలక ప్రసంగం
చురాచంద్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. వేలాదిమంది పాల్గొన్న ఆ సమావేశంలో కీలక సందేశం ఇచ్చారు. ‘‘మణిపూర్ ప్రజల ధైర్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన భారీ వర్షంలో కూడా మీరు భారీ సంఖ్యలో సభకు వచ్చారు. మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వర్షం కారణంగా నేను ప్రయాణించాల్సిన హెలికాప్టర్ రావడం సాధ్యపడలేదు. అందుకే నేను రోడ్డుమార్గం ద్వారా రావాలని నిర్ణయించుకున్నాను. నేను రోడ్డు మార్గంలో చూసిన దృశ్యాలను బట్టి నా మనసు కొన్ని విషయాలు చెబుతోంది. హెలికాప్టర్ ద్వారా రాకపోవడం మంచిదే. ఎందుకంటే, నా జీవితంలో మరచిపోలేని ప్రేమ, ఆదరణ మీరు చూపించారు. ప్రతి ఒక్కరూ చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకొని చూపిన ఆత్మీయత నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. తలవంచి మణిపూర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ప్రజల జీవితాలు తిరిగి సాధారణ స్థితికి రావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.
మణిపూర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అన్ని సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ‘‘ మీ వెంటనే ఉన్నానని ఈ రోజుకు మీకు హామీ ఇస్తున్నాను. భారత ప్రభుత్వం మణిపూర్ ప్రజల వెంట ఉంది. ఇకపై హింసకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించాలి’’ అని మోదీ కోరారు.
Read Also- Minister Seethakka: చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు