Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త అందించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ‘సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025’ ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడుత నిధులను విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18వేల కోట్లకు పైగా నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో (డీబీటీ) జమ చేశారు.
Also Read: Narendra Modi: బీహార్ ఘన విజయంతో బీజేపీలో ఫుల్ జోష్.. నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అంటూ..!
వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా మారుతోంది
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 విడతల్లో 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో గత 11 ఏళ్లలో జరిగిన సంస్కరణల గురించి వివరించారు. దేశం సహజ వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా మారుతోందని, రైతులు కనీసం ఒక్క ఎకరం భూమిలోనైనా సహజ వ్యవసాయ పద్ధతులను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్లకు పైగా సాయం అందిందని కూడా ప్రధాని తెలిపారు.
పుట్టపర్తి పవిత్ర భూమి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తొలుత సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. ఈ ప్రాంతంలో ఏదో మహత్తు ఉందని, పుట్టపర్తి పవిత్ర భూమి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపంగా జీవించారని, భౌతికంగా బాబా లేకపోయినా, ఆయన బోధనలు లక్షల మందికి సరైన మార్గాన్ని చూపాయని తెలిపారు.
విశిష్ట సేవలను ప్రధాని ప్రత్యేకం
సాయి తమ జీవితాలను సమూలంగా మార్చారని, లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని ప్రధాని అన్నారు. ప్రజల కోసం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిల్లాలని మోదీ ఆకాంక్షించారు. అంతకుముందు, సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు.
Also Read: Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ
