PM Modi – Trump: అధిక టారీఫ్‌ల వ్యవహారం కారణంగా భారత్, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు సున్నితంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు, భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక సంఘర్షణను తానే ఆపానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడం, దానిని భారత్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఇరుదేశాల బంధాల్లో కాస్త గ్యాప్ పెరిగింది. పరిస్థితులు ఈ విధంగా ఉండగానే, ఇటీవల కొన్ని వారాల వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నించినా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi – Trump) తిరస్కరించారని జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్‌గుమై (Frankfurter Allgemeine) అనే ప్రముఖ పత్రిక పేర్కొంది. ట్రంప్‌తో మాట్లాడేందుకు మోదీ నిరాకరించారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ పట్ల మోదీ ఆగ్రహ తీవ్రత, జాగ్రత్తగా వ్యవహరించే స్వభావానికి ఈ పరిణామం అద్దం పడుతోందని విశ్లేషించింది. ట్రంప్ వైఖరి విషయంలో మోదీ నొచ్చుకున్నారని చెప్పడానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పత్రిక పేర్కొంది. బెర్లిన్‌లోని గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు థార్స్టెన్ బెన్నర్ వార్తా పత్రిక కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే దేశాలను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చని ట్రంప్ అనుకున్నారని, కానీ, మోదీ మాత్రం అలాంటి ఒత్తిడులకు లోనవకుండా, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించేందుకుగానూ జాగ్రత్తగా వ్యవహరించారని, భారత ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదని ఫ్రాంక్‌ఫర్టర్ పత్రిక వ్యాఖ్యానించారు.
Read Also- Sachin on Joe Root: సచిన్ రికార్డ్ చెరిపివేసే దిశగా జో రూట్.. తొలిసారి స్పందించిన సచిన్ టెండూల్కర్
మోదీ ఇప్పటికీ ట్రంప్‌తో ఫోన్ మాట్లాడేందుకు అంగీకరించకపోవడం చూస్తుంటే, ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నారో, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని ఫ్రాంక్‌ఫర్టర్ పత్రిక పేర్కొంది. అయితే, గతంలో అమెరికా–వియత్నాం మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని, ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో ట్రంప్ పరిష్కరించారని, వియత్నాం ప్రధాన కార్యదర్శి లామ్‌తో మాట్లాడి వాణిజ్య ఒప్పందాన్ని మార్చివేశారని, ఎలాంటి ఒప్పందం ఖరారు కాకుండానే ‘వాణిజ్య ఒప్పందం కుదిరింది’ అంటూ ట్రంప్ ప్రకటించారంటూ ఈ కథనం గుర్తుచేసింది. అలాంటి చిక్కుల్లో పడకూడదని మోదీ భావిస్తున్నారేమోనని విశ్లేషించింది.
అమెరికా వ్యూహం పనిచేయడం లేదు
మరోవైపు, న్యూయార్క్‌లోని ఇండియా-చైనా ఇన్‌స్టిట్యూట్ సహ-డైరెక్టర్ మార్క్ ఫ్రేజియర్ మాట్లాడుతూ, చైనాను నియంత్రించేందుకు అమెరికా రూపొందించిన ‘ఇండో-పసిఫిక్’ వ్యూహంలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, కానీ, ఆ వ్యూహం విఫలమవుతోందని విశ్లేషించారు. భారత్ ఎప్పుడూ చైనాకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలవాలనే ఉద్దేశంతో కాకుండా, తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ఇదిలావుంచితే, అమెరికా తన ఆర్థిక విధానాల కింద భారత వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించింది. బ్రెజిల్ మినహా అమెరికా ఒక దేశంపై విధిస్తున్న అత్యధిక సుంకాలు భారత్‌పైనే కావడం గమనార్హం.
Read Also- Ajith Doval: అండర్‌కవర్ ఏజెంట్‌గా పాక్‌లో ఉండి.. రహస్యాన్ని కనిపెట్టిన అజిత్ దోవల్
భారత్-అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య వివాదం ట్రంప్‌కు చెందిన నిర్మాణ కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారిందని ఫ్రాంక్‌ఫర్టర్ పత్రిక పేర్కొంది. ఢిల్లీకి సమీపంలో ట్రంప్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ నిర్మించిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు కూడా వివాదాలకు గురవుతున్నాయని, ఒక్క రోజులోనే 300 అపార్ట్‌మెంట్లు అమ్ముడుపోయాయని పేర్కొంది. ఇండియా-పాకిస్థాన్ మిలిటరీ ఘర్షణను తానే ఆపానంటూ ట్రంప్ చెప్పడం భారత అధికార వర్గాలకు కోపం తెప్పించిందని విశ్లేషించింది. అంతేకాదు, పాకిస్థాన్‌తో కలిసి ఆయిల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తానని, ఆ ఆయిల్‌ను భారతే కొనుగోలు చేస్తుందేమో అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం భారత ఆగ్రహాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించింది.