PM SVANidhi Credit Card: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కేరళలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒక రైలు త్రిస్సూర్-గురువాయూరు మధ్య నడుస్తుంది. ఈ రైలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచుతుంది. రైళ్లతో పాటు సీఎస్ఐఆర్- ఎన్ఐఐఎస్‌టీ (CSIR-NIIST) ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక, ‘పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్’ను (PM SVANidhi Credit Card) కూడా ఆయన ఆవిష్కరించారు. పీఎం స్వానిధి పథకం లబ్దిదారులు పలువురికి క్రెడిట్ కార్డులను కూడా ఆయన అందించారు. మరి, ఇంతకీ ‘పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ ఏమిటి?, ఎవరికి ఉపయోగం?, ఏమేం ప్రయోజనాలు ఉంటాయి?, ఆ వివరాలను తెలుసుకుందాం.
వీధి వ్యాపారుల కోసం..
ఎన్నో ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొనే వీధి వ్యాపారుల కోసం ‘పీఎం స్వానిధి క్రెడిట్ కార్డు’ను (PM SVANidhi Credit Card) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. వీధి వ్యాపారులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్డ్ ప్రత్యేకత ఏమిటంటే, యూపీఐతో లింక్ అయ్యి ఉంటుంది. అంటే, బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, వ్యాపారాలకు అవసరమైన చిన్నమొత్తాలను రుణంగా తీసుకోవచ్చు. ఒకసారి పీఎం స్వానిధి క్రెడిట్ కార్డు వచ్చిందంటే, దానికి కొంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక రూ.30,000 పరిమితిగా ఉంటే, దానిని తీసుకొని, మళ్లి చెల్లించి, ఆ తర్వాత తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. సరుకులు కొనాలనుకునే వీధి వ్యాపారులు, తాత్కాలిక డబ్బు అవసరాల కోసం ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు సులభంగా డిజిటల్ రుణాలు అందాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చింది.
ఈ క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుంది?
స్వానిధి క్రెడిట్ కార్డు.. యూపీఐతో లింక్ అయ్యి ఉంటుంది. అంటే, బ్యాంకులు ఒక వీధి వ్యాపారికి పీఎం స్వానిధి క్రెడిట్ కార్డు జారీ చేస్తే.. ఆ కార్డు రుణపరిమితి ఖాతాదారుడి యూపీఐకి లింక్ అవుతుంది. గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్‌కు అనుసంధానమై ఉంటుంది. అప్పుడు, యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తే క్రెడిట్ లిమిట్ నుంచి కట్ అవుతాయి. వాడుకున్నాక తిరిగి చెల్లిస్తే లిమిట్ మళ్లీ అందుబాటులోకి వస్తుంది. తిరిగి మళ్లీ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. నిర్ణీత కాలంలో చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌తో లింక్ చేయడంతో కార్డును తీసుకెళ్లి ఎక్కడా స్వైప్ చేయాల్సిన పని ఉండదు. సింపుల్‌గా యూపీఐ ద్వారా స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు.
ఈ ప్రత్యేక క్రెడిట్ కార్డు రూపే నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక, ఈ కార్డు పొందడానికి అర్హులు ఎవరు? అనే విషయానికి వస్తే, ఇప్పటికే పీఎం స్వానిధి లోన్ పథకం కింద రుణం తీసుకున్న వీధి వ్యాపారులు ఎలిజిబుల్ అవుతారు. లోన్ తీసుకొని సకాలంలో చెల్లించినవారు, మంచి రీపేమెంట్ రికార్డు ఉన్నవారికి ఈ కార్డు వస్తుంది. క్రెడిట్ లిమిట్, వినియోగం సాధారణంగా అయితే రూ.30,000 వరకు ఉంటుంది. సరుకుల కొనుగోలు, వ్యాపార అవసరాల కోసం చిరువ్యాపారులు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. నిజానికి, పీఎం స్వానిధి పథకం 2020లో ప్రారంభమైంది. కరోనా మహమ్మారి విలయ తాండవ సృష్టించిన తర్వాత వీధి వ్యాపారులు కుదేల్లయ్యారు. తిరిగివారు నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇప్పుడు, పీఎం స్వానిధి క్రెడిట్ కార్డు కూడా వీధి వ్యాపారులకు అందుబాటులోకి వస్తే, వెంటనే రుణం దక్కుతుంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు, మోసాలు తప్పుతాయి. మరోవైపు, వీధివ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవీల్లో భాగస్వామ్యం అవుతారు. వ్యాపార కార్యకలాపాలు కూడా డిజిటల్‌గా రికార్డ్ అవుతాయి.
Read Also- Sama Ram Mohan Reddy: సిట్ ముందుకు కేటీఆర్.. బయట జరిగే డ్రామాలు.. సీన్స్ వారీగా కాంగ్రెస్ రివీల్!

