Pak Targets Salman: ఓ ప్రైవేటు కార్యక్రమంలో సందర్భోచితంగా, బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను దాయాది దేశం పాకిస్థాన్ అపార్థం చేసుకొని, సీరియస్‌గా తీసుకుంది. అనవసర రాద్ధాంతం చేసి, భారత్‌కు చెందిన ఈ స్టార్ హీరోపై ఉగ్రవాది అనే ముద్ర వేయాలని (Pak Targets Salman) కుట్రలు చేస్తోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇటీవల జరిగిన ‘జాయ్ ఫోరమ్ 2025’లో సల్మాన్ మాట్లాడుతూ, ఒక హిందీ సినిమాను సౌదీలో విడుదల సూపర్‌హిట్ అవుతుందన్నాడు. తమిళం, తెలుగు, మలయాళీ మూవీ విడుదల చేసినా వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయన్నాడు. ఇతర దేశాలకు చెందినవారు చాలామంది ఇక్కడ వేర్వేరు పనులు చేసుకుంటున్నారని, బలూచిస్థాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్థాన్ నుంచి వచ్చినవారు కూడా ఈ దేశంలో ఉన్నారని ప్రస్తావించాడు. అయితే, పాకిస్థాన్‌లోని రాష్ట్రాలలో ఒకటైన బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశం, లేదా ప్రాంతం అనిపించేలా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని పాక్ ఆక్రోశిస్తోంది. అందుకే, ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. తమ దేశంలో అంతర్భాగమైన ప్రాంతాన్ని వేరు చేస్తూ మాట్లాడడాన్ని కుట్రగా, దురుద్దేశపూరితంగా చేసిన వ్యాఖ్యలుగా పరిగణిస్తోంది.
ఉగ్రవాద అనుమానిత జాబితాలోకి సల్మాన్ పేరు!
బలూచిస్థాన్‌పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో దుమారం రేపుతున్నాయి. దీంతో, పాక్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ పేరును ఉగ్రవాద నిరోధక చట్టం 4వ షెడ్యూల్ జాబితాలో చేర్చిందంటూ కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను మాత్రమే ఈ జాబితాలో చేర్చుతారు. సల్మాన్ ఖాన్‌పై కక్షగట్టి పాకిస్థాన్ ఈ చర్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. ఈ జాబితాలో ఎవరి పేరైనా చేర్చితే, వారి కదలికలను పాక్ అధికారులు గమనిస్తుంటారు. నిఘా కూడా ఉంచుతారట. అవసరమైతే చట్టపరమైన చర్యలకు కూడా అవకాశం ఉంటుందంటూ పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదంపై సల్మాన్ ఖాన్ ఇంతవరకు స్పందించలేదు.
Read Also- Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో, పాకిస్థాన్‌లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యాయి. కొందరు పాక్ అధికారులు ఈ వ్యాఖ్యలను బాహాటంగానే ఖండించారు. సల్మాన్ వ్యాఖ్యలు తమదేశ ప్రాదేశిక సమగ్రతను అవమానించే విధంగా ఉందని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే పాక్ నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా బలూచ్ వేర్పాటువాదులు సల్మాన్‌కు మద్దతు తెలిపారు. సల్మాన్ వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచ్ ప్రజలకు సంతోషాన్ని కలిగించాయని ఎక్స్‌లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు.
Read Also- Migraine Relief: ఇంట్లో ఉండే వాటితోనే మైగ్రేన్ తలనొప్పికి ఇలా చెక్ పెట్టేయండి!
బలూచిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచి ప్రజలు వచ్చి సౌదీలో పనిచేస్తుంటారని సల్మాన్ ఖాన్ అనడం నిజమే కానీ, ఆయన అవగాహన లేకుండా అలా అనేశారా?, లేక లోతైన అర్థం ఉందా? అనే ఎవరికీ తెలియదు. అవగాహన లేకుండా మాట్లాడినట్టుగానే అనిపిస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా, పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ ప్రత్యేక దేశంలో ఏర్పడాలని ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం ఎప్పటినుంచో అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఈ ప్రావిన్స్ భూభాగం ఏకంగా 46 శాతంగా ఉంటుంది. ఇక్కడ సహజ వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. కానీ, తమ అభివృద్ధిని పాకిస్థాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆర్థిక నిర్లక్ష్యం, వనరుల దోపిడీ, సైనిక అణచివేత, ఇలా అన్ని విధాలా అణచివేతకు గురవుతున్నామని పేర్కొంది.
