Tatkal Ticket Booking: ముందస్తు రిజర్వేషన్ గడువు ముగిసిన తర్వాత, లేదా చివరి నిమిషంలో అనుకోకుండా ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు (Tatkal Ticket Booking) ఎంతో ముఖ్యమైనవనే విషయం తెలిసిందే. అయితే, ఈ టికెట్ల బుకింగ్‌లో బుకింగ్‌లో పారదర్శకతను పెంచుతూ ఇండియన్ రైల్వేస్ (Indian Railways) కీలక చర్య తీసుకుంది. కొత్తగా ఒక సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ప్యాసింజర్లు ఇకపై మొబైల్ నంబర్‌కు వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్‌ని (OTP) తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టికెట్లు జారీ చేస్తారు. ఈ ఓటీపీ ధృవీకరణ విధానం సోమవారం (డిసెంబర్ 1) అమలులోకి వచ్చింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే (Railway News) ఒక ప్రకటన చేసింది. రైల్వే బోర్డు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తత్కాల్ బుకింగ్ సిస్టమ్‌లో కీలకమైన మార్పు జరిగిందని వివరించింది.
‘సిస్టమ్-జనరేటెడ్ ఓటీపీ’ని ధృవీకరించిన తర్వాత మాత్రమే తత్కాల్ టికెట్లు జారీ అవుతాయని, ఈ ఓటీపీ టికెట్ బుక్ చేసే సమయంలో ప్యాసింజర్ ఇచ్చిన మొబైల్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వెళుతుందని, ఆ ఓటీపీని సక్సెస్‌పుల్‌గా ధృవీకరించిన తర్వాతే టికెట్ జారీ అవుతుందని పశ్చిమ రైల్వే పేర్కొంది. ఈ ఓటీపీ ఆధారిత తత్కాల్ ధృవీకరణ వ్యవస్థను మొదటి దశలో భాగంగా, ట్రైన్ నంబర్ 12009/12010 ముంబై సెంట్రల్ – అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అమలు చేస్తారని, ఆ తర్వాత నెట్‌వర్క్‌లోని ఇతర రైళ్లకు విస్తరించనున్నారని పేర్కొంది. ఆ తర్వాత మిగతా జోన్లలో కూడా ఇండియన్ రైల్వేస్ క్రమంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వర్తింపు
ఈ ఓటీపీ ధృవీకరణ వ్యవస్థ అన్ని టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వర్తించనుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, రైల్వే కౌంటర్లతో పాటు అన్ని బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుందని పశ్చిమ రైల్వే తెలిపింది. తత్కాల్ బుకింగ్‌లలో పారదర్శకతను పెంచడం, అత్యవసరంగా ప్రయాణించాల్సిన నిజమైన ప్రయాణీకులకు తత్కాల్ టిక్కెట్లను అందుబాటులోకి ఉండేలా చేయడం దీని ముఖ్యఉద్దేశమని అధికారులు చెప్పారు. కాగా, అక్టోబర్ 28న ప్రకటించిన ఐఆర్‌సీటీసీ సమాచారం ప్రకారం, రిజర్వేషన్ ప్రారంభమయ్యే మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య టికెట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆధార్ ధృవీకరణ చేయని ప్యాసింజర్లకు ఈ నిర్దిష్ట సమయంలో టికెట్లు బుక్ చేసుకోవడం సాధ్యపడదు.
Read Also- New Rule: డిలీట్ చేయడానికి వీలులేకుండా ఫోన్లలో కొత్త యాప్.. తయారీ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు!
