Parliament
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Parliament: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్‌’పై చర్చ.. ముహూర్తం ఫిక్స్

Parliament: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) చర్చకు ముహూర్తం ఖరారైంది. సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతుందని, మంగళవారం నాడు రాజ్యసభలో చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు మొత్తం 32 గంటల సమయం కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. లోక్‌సభకు 16 గంటలు, రాజ్యసభకు 16 గంటల చొప్పున కేటాయించినట్టు వివరించారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకు, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతుందని రిజిజు వెల్లడించారు. విపక్ష పార్టీలు వివిధ అంశాలు లేవనెత్తాలనుకున్నాయని, అయితే, ముందుగా ‘ఆపరేషన్ సిందూర్’ అంశంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలన్న విపక్షాల డిమాండ్‌పై మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే అధికారం విపక్షాలకు లేదని విమర్శించారు.

సోమవారం నుంచి సజావుగా సభలు!
జులై 28 నుంచి లోక్‌సభ సజావుగా కొనసాగించేందుకు ప్రభుత్వం- విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా, ఎలాంటి ఉత్పాదకత లేకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ప్రశ్నోత్తర సమయంలో సభా మర్యాదలను పాటిస్తూ, కీలక అంశాలపై చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు విపక్ష పార్టీల ప్రతినిధులు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో, సోమవారం నుంచి పార్లమెంటులో చర్చలు నిరాటంకంగా కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read Also- Viral News: టీనేజర్‌పై అన్నదముళ్ల అఘాయిత్యం.. ప్రెగ్నెంట్ అని తెలియగానే..

సహకరించండి: స్పీకర్ ఓం బిర్లా
రాజకీయంగా, వ్యూహాత్మకంగా చాలా కీలకమైన అంశమైన ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ చేపట్టనుండడం ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలంటూ విపక్ష పార్టీలు చేసిన డిమాండ్‌కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలతో సమావేశంలో నిర్ణయించారు. అయితే, ప్రశాంతమైన వాతావరణంలో చర్చకు సహకరించాలని విపక్ష పార్టీల ఎంపీలను ఆయన కోరారు. చట్టసభ్యులకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే సభా నియమాలకు అనుగుణంగా తెలియజేయాలని సూచించారు. ఆందోళన తెలిపేందుకు తగిన మార్గాలు ఉన్నాయని, సభ నడవనివ్వకపోతే ప్రయోజనం ఉండదని సూచించారు.

ఉభయసభలు సోమవారానికి వాయిదా
శుక్రవారం పార్లమెంట్‌ ఉభయ సభలు తిరిగి సోమవారానికి వాయిదాపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ తిరిగి జులై 28న షురూ కానున్నాయి. బీహార్‌లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. దీంతో, లోక్‌సభను తొలుత 11 గంటలకు, తర్వాత మళ్లీ 2 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ సభలో నిరంతర నినాదాలు, నిరసన తెలిపిన ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు కూడా దూసుకొని రావడంతో సభా వ్యవహారాలు నిలిచిపోయాయి. స్పీకర్ ఓం బిర్లా గైర్హాజరుతో సభకు అధ్యక్షత వహించిన లోక్‌సభ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ చట్టసభ్యులు సహకరించాలని కోరారు. ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సహకరించాలని, 200 మందికి పైగా ఎంపీలు తమ ప్రతిపాదనలు సిద్ధం చేశారంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష పార్టీలు ఎంపీ ఆందోళనలు విరమించలేదు. దీంతో, సభను తిరిగి సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా జగదాంబికా పాల్ ప్రకటించారు. రాజ్యసభను కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాయిదా పడింది.

Read Also- OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

రాహుల్ గాంధీ ‘డస్ట్ బిన్’ నిరసన
పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం వినూత్న నిరసన జరిగింది. బీహార్‌లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణకు (SIR) నిరసగా కాంగ్రెస్ సారధ్యంలోని ఇతర విపక్ష పార్టీలు వినూత్న నిరసనకు దిగాయి. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలు ‘డస్ట్ బిన్’ నిరసన చేపట్టారు. ‘సర్’ (SIR) అని ముద్రించి ఉన్న పోస్టర్లను చించివేసి వాటిని డస్ట్‌ బిన్‌లో వేశారు. బీహార్‌లో ఓటర్ల జాబితా పునరుద్ధరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంపీగా ప్రమాణం చేసిన కమలహాసన్
దిగ్గజ తమిళ నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం తన పార్లమెంట్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తమిళ భాషలో ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో ఇతర పార్లమెంట్ సభ్యులు టేబుళ్లను చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దీంతో, కమల్ హాసన్ ప్రమాణ స్వీకార సన్నివేశం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమల్ హాసన్‌కు ప్రస్తుతం 69 సంవత్సరాలు. జూన్ 12న ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే సారధ్యంలోని కూటమి ఆయనకు ఏకగ్రీవ మద్దతు తెలిపింది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్