Pune Court: ట్రెండ్ పేరుతో కొందరు మహిళలు సంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ జనరేషన్ కు చెందిన వివాహితలు ముఖాన బొట్టు, మెడలో తాళి ధరించడాన్ని నామోషిగా ఫీలవుతున్నారు. అలా ఉండకూడదని హిందూ మత పెద్దలు, సనాతన వాదులు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అదే వైఖరితో కోర్టుకు హాజరైన ఓ మహిళకు జడ్జి చివాట్లు పెట్టారు. సదరు మహిళను ఉద్దేశించి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.
‘అలా ఉంటే.. ఎందుకు ఆసక్తి చూపిస్తాడు’
మహారాష్ట్రలోని పూణె సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఓ మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి అయిన లాయర్ అంకుల్ ఆర్. జహంగీర్ లింక్డ్ ఇన్ పంచుకున్నారు. విడాకుల కోసం వచ్చిన జంటలకు మధ్యవర్తిత్వం వహించే జడ్జి ముందుకు గృహ హింస కేసుకు సంబంధించి ఓ జంట హాజరైంది. ఈ క్రమంలో సదరు మహిళ.. వివాహమైన స్త్రీలానే కనిపించకపోవడంతో జడ్జి అసహనం వ్యక్తం చేసినట్లు సదరు లాయర్ తెలిపారు. ‘నువ్వు బొట్టు పెట్టుకోలేదు. మంగళసూత్రం కూడా వేసుకోలేదని అర్థమవుతోంది. నువ్వు పెళ్లైన స్త్రీలా ప్రవర్తించకుంటే నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు?’ అని న్యాయమూర్తి ఆ మహిళకు క్లాస్ పీకినట్లు లాయర్ జహంగీర్ తెలిపారు.
Also Read: BJP MP Tejasvi Surya: సింగర్ ని పెళ్లాడిన అత్యంత పిన్న వయసు ఎంపీ.. ఫొటోలు వైరల్
పురుషులపై ప్రశంసలు..
కేసు విచారణ సందర్భంగా సెషన్స్ కోర్ట్ జడ్జి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేసినట్లు లాయర్ జహంగీర్ తన సోషల్ మీడియో పోస్టులో పేర్కొన్నారు. ఒక మహిళా బాగా సంపాదిస్తుంటే ఆమె ఎల్లప్పుడూ తన కంటే ఎక్కువ జీతం వచ్చే పురుషుడినే కోరుకుటుందని జడ్జి అన్నట్లు చెప్పారు. అదే బాగా సంపాదించే మగ వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే తన ఇంట్లో వంట పాత్రల్ని కడిగే పని మనిషిని సైతం వివాహం చేసుకునేందుకు వెనుకాడడని చెప్పినట్లు తెలిపారు. పురుషులు ఎంత సరళంగా ఉంటారో.. మీరూ అలాగే ఉండాలని మహిళకు న్యాయమూర్తి సూచించినట్లు తన పోస్టులో జహంగీర్ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాతో పాటు జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది.