No Helmet No Petrol: దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా బలి అవుతున్నారు. నిర్లక్ష్యమైన డ్రైవర్ కు తోడు.. హెల్మెట్ ధరించని కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. వాహనం నడవడానికి ఎంతో కీలకమైన పెట్రోల్ కు హెల్మెట్ ను లింకప్ చేస్తున్నాయి. తద్వారా హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh Govt).. భోపాల్ (Bhopal), ఇండోర్ (Indore) నగరాల్లో ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో మరో జిల్లాకు సైతం దానిని తాజాగా విస్తరించింది.
వివరాల్లోకి వెళ్తే..
హెల్మెటే వాహనదారులకు శ్రీరామరక్ష అన్న కాన్సెప్ట్ ను మధ్య ప్రదేశ్ ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంది. ఇందులో భాగంగా హెల్మెట్ లేని వాహనదారులకు ఎట్టిపరిస్థితుల్లో పెట్రోల్ కొట్టవద్దని బంక్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల దీనిని ప్రయోగాత్మకంగా భోపాల్, ఇండోర్ నగరాల్లో ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా భీండ్ జిల్లాకు సైతం ఈ విధానాన్ని విస్తరించి.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ (Sanjeev Shrivastava) కఠిన ఆదేశాన్నిజారీ చేశారు. రోడ్ ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కలెక్టర్ ఉత్తర్వులో ఏముందంటే?
కలెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం ‘గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారుల మృతుల శాతం ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ఈ ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది’ అని కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ లు తప్పనిసరిగా ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Also Read: Zara Ads: మీవి ఒక ప్రకటనలేనా.. మోడల్స్ అస్థిపంజరాల్లా ఉన్నారంటూ నిషేధం!
ఈ రెండు పరిస్థితుల్లో మినహాయింపు
నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానానికి రెండు మినహాయింపులు సైతం కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఇచ్చారు. వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనలు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. ‘భారత పౌరుల రక్షణ నిబంధనల కోడ్ 2023 నాటి సెక్షన్ 163(2) ప్రకారం ఏకపక్షంగా ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ ఆదేశానికి సంబంధించిన ఎవరైనా అభ్యంతరాలు/దరఖాస్తులు కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్, భీండ్ కోర్టుకు సెక్షన్ 163(5) ప్రకారం సమర్పించవచ్చు’ అంటూ కలెక్టర్ తన ఉత్తర్వులో సూచించారు.