MK Stalin: పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం అమలుపై నిజాయితీ లోపించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చేసిన విమర్శలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. అతడొక ‘అహంకార చక్రవర్తి’ అంటూ ఎక్స్ (Twitter) వేదికగా మండిపడ్డారు. తమిళ ప్రజలంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని తాను కింగ్ అనుకుని ధర్మేంద్ర అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ సీఎం స్టాలిన్ (Tamilnadu CM MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డీఎంకేపై కేంద్ర మంత్రి మండిపాటు
పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలుత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. తమిళనాడు సంక్షేమంపై అధికార డీఎంకేకు నిజాయతీ లోపించిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆ ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. ‘పీఎం శ్రీ’ (Prime Minister’s Schools for Rising India) పథకం ఎంఓయూపై సంతకం చేసేందుకు మొదట అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం.. ఆ తర్వాత అనూహ్యంగా తన వైఖరి మార్చుకుందని పేర్కొన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు భాజాపాయేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఈ పథకంపై ఎంఓయూపై సంతకాలు చేయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని చెప్పారు. అయితే కేంద్ర మంత్రి విమర్శలను తీవ్రంగా తప్పుబట్టిన ఆ పార్టీ ఎంపీలు.. లోక్‌సభ నుంచి వాకౌట్ చేసారు.
Also Read: Sri Chaitanya IT Rides: శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
సీఎం స్టాలిన్.. స్ట్రాంగ్ వార్నింగ్
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకానికి సంబంధించి కేంద్రమంత్రి చేసిన విమర్శలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. PM SHRI స్కీమ్ అమలుకు తాము ముందుకు రాలేమని తమిళనాడు సర్కార్ ముందే చెప్పిందని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తుందని సోషల్ మీడియాలో పోస్టులో స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలను అవమానిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యాలను పీఎం మోదీ అంగీకరిస్తారా అంటూ నిలదీశారు.