Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ171 కుప్పకూలగా, ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మంది సిబ్బంది. కాగా, మిగతావారంతా ప్రయాణీకులే. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కనీసం 200 మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నమ్మశక్యంకాని రీతిలో రమేష్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Ramesh Viswas Kumar) అనే వ్యక్తి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన తనంతట తానుగా నడుచుకుంటూ కనిపించారు. అంబులెన్స్ వైపు వెళ్లే సమయంలో ఎవరి సాయం లేకుండా కాస్త కుంటుతూ నడిచారు.
Read this- Plane Crash: పాపం.. పెళ్లైన 5 నెలలకే.. తీవ్ర విషాదం
అంతటి ఘోర విమాన ప్రమాదం నుంచి రమేష్ ప్రాణాలతో బయటపడడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మృత్యుంజయుడు కాకపోతే మరేంటి అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. రమేష్ వయసు 38 సంవత్సరాలు. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగివున్నాడు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు వెనుక భాగంలో ఉండే 11ఏ సీటులో రమేష్ కూర్చున్నాడు. ప్రాణాలతో బయటపడ్డ అతడికి కొన్ని గాయాలయ్యాయి. ముఖంపై దెబ్బలు బాగానే తగిలాయి. గాయాలు ఉన్నప్పటికీ, చికిత్స కోసం అంబులెన్స్ వైపు నడిచి వెళ్లడం వీడియోల్లో కనిపించింది. విమానంలో ఇతర ప్రయాణికుల సంగతి ఏమిటని చాలామంది అతడిని ప్రశ్నిస్తుండడం వినిపించింది. ‘విమానం పేలిపోయింది’’ అని గుజరాతీ భాషలో వారికి అతడు సమాధానం ఇచ్చాడు. ఇతర ప్రయాణీకుల పరిస్థితి ఏమిటని మళ్లీ అడగగా, ‘లోపల ఉన్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
టేకాఫ్ తర్వాత 30 సెకన్లపాటు శబ్దం: రమేష్
హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రమేష్ విశ్వాస్ కుమార్ ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రాకేష్‌తో కలిసి తిరిగి యూకే వెళుతున్నట్టు చెప్పాడు. ‘‘నా బ్రదర్ వేరే వరుసలోని సీటులో కూర్చున్నాడు’’ అని వెల్లడించాడు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత, 30 సెకన్లపాటు భారీ శబ్దం వచ్చిందని, ఆ తర్వాత విమానం కూలిందని వివరించాడు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా, రమేష్‌కు ఛాతి మీద, ముఖం మీద గాయాలయ్యాయి.
ఆ ఒక్కడు అతడేనా?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ, ఒకే ఒక్క ప్యాసింజర్ ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. 11ఏ సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు గుర్తించామన్నారు. కాగా, ప్రాణాలతో బయటపడిన రమేష్ అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read this- Plane Crash: విమానం ఎందుకు కూలింది?.. ఇంజనీర్ ఏం చెప్పారు?
11ఏ సీటు సురక్షితమా?
ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలోని 11ఏ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్‌లోని మొదటి వరుసలో ఉంటుందని విమానాల సీట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ‘ఏరోలోపా’ అనే సంస్థ డేటా పేర్కొంది. 11ఏ విండో సీటు. విమానం కుడి వైపున ఉంటుంది. విమానం రెక్కలకు రెండు వరుసల ముందు ఉంటుంది. డోర్‌కు వెనుకవైపు ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో ఈ సీటు ఎమర్జెన్సీ విండోగా ఉపయోగపడుతుందని డేటా చెబుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు వెళ్లేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. అప్పటికి 625 అడుగుల ఎత్తు మాత్రమే ఎక్కిందని రాడార్ డేటా స్పష్టం చేస్తోంది. ఆ ఎత్తు నుంచి కేవలం 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. మరి ఇంత తక్కువ సమయంలోనే కూలవడం ఎమర్జెన్సీ విండోని తెరిచే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ రమేష్ ఎలా బయటపడ్డాడనేది అమితాశ్చర్యానికి గురిచేస్తోంది.