Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి (TMC) కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్ (I-PAC) ఆఫీసులో గురువారం ఈడీ సోదాలు జరిగిన తర్వాత అక్కడి రాజకీయాలు హీటెక్కాయి. ఈడీ దాడుల పట్ల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా (Amit Shah) బొగ్గు కుంభకోణానికి (Coal Scam) పాల్పడ్డారని ఆరోపించారు. అందుకు సంబంధించిన పెన్‌డ్రైవ్ తన వద్ద ఉందని అన్నారు. హద్దుమీరి తనను, తన ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేస్తే మాత్రం కచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్‌ను బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం సీటుపై గౌరవంతో మౌనం..
తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని, ఆ సీటుపై గౌరవంతో నిశబ్దంగా ఉంటున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘‘నా దగ్గర పెన్‌డ్రైవ్స్ ఉన్నాయి. సీఎం సీటుపై గౌరవంతో ఊరుకుంటున్నా. అతిగా నన్ను ఒత్తిడి చేయవద్దు. ప్రతిదీ బయటపెడతా. దేశమంతా దిగ్భ్రాంతి చెందుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈడీ సోదాలకు వ్యతిరేకంగా శుక్రవారం కోల్‌కతాలో చేపట్టిన ర్యాలీకి పెద్ద సంఖ్యలో విచ్చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?
కాగా, గురువారం కోల్‌కతాలోని ఐ-ప్యాక్ ఆఫీసుపై ఈడీ సోదాలు నిర్వహించింది. అంతేకాదు, ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. చట్టవిరుద్ధంగా బొగ్గు మైనింగ్ కేసులో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద సోదాలు నిర్వహించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే, సోదాలు జరుగుతున్న ప్రాంతానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పెద్ద సంఖ్యలో అనుచరులు, పోలీసులతో సోదాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోదాలు జరిగిన ప్రాంతానికి వెళ్లడమే కాకుండా, అక్కడి నుంచి కొన్ని ఫైళ్లు, పెన్‌డ్రైవ్‌లను కూడా మమత తనవెంట తీసుకెళ్లారు. ఆ ఫైళ్లలో అత్యంత సున్నితమైన ఎన్నికల వ్యూహాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈడీ సోదాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లడంపై మమతా బెనర్జీ స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. బొగ్గు కుంభకోణంలో వసూలు చేసిన డబ్బు మొత్తం చివరికి కేంద్ర మంత్రి అమిత్ షాకు వెళ్లాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నిధులు పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ద్వారా ఢిల్లీకి చేరుతున్నాయని ఆరోపించారు. ఇక, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి ఒక వంచకుడని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Ambani-Adani: వామ్మో.. ఒకే రోజు అంబానీ, అదానీలకు చెరో రూ.22 వేల కోట్లకుపైగా నష్టం.. ఎందుకంటే?

