Madhabi Puri Buch: స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మాజీ చీఫ్ మాధవి పురి బచ్ కు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. బచ్ తో సహా బీఎస్ఈ ఎండీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ పై ఎఫ్ ఆర్ఐ నమోదు చేయాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు కింది కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో మాధవి పురి బచ్ కు అరెస్టు నుంచి రక్షణ లభించినట్లైంది.
అసలేం జరిగిందంటే
స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీలను లిస్ట్ చేయడంలో సెబీ (SEBI) మాజీ చీఫ్ మాధవి పురి బచ్ (Madhabi Puri Buch) భారీ ఎత్తున ఆర్థిక మోసం, అవినీతి చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. బచ్‌తో పాటు బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ సుందరరామన్ రామమూర్తి, పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్, సెబీ పూర్తికాల సభ్యులు అశ్వనీ భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్రలపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని థానేకి చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ మాధవి పురి బచ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
బాంబే హైకోర్టు ఏమన్నదంటే
సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బచ్ కేసు ఇవాళ విచారణకు రాగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి స్థాయి పరిశీలన జరగకుండానే కింది కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణ వరకూ ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.
Also Read: Brain Health Tips: సూపర్ హ్యూమన్ గా మారాలా? అయితే ఇవి పాటించండి!
హిండెన్ బర్గ్ రిపోర్టులో బచ్ పేరు
సెబీ (SEBI) మాజీ చీఫ్ మాధవి పురి బచ్‌ను గత కొంతకాలంగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అదానీ కంపెనీకి చెందిన ఆఫ్ షోర్ కంపెనీల్లో ఆమె భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారంటూ గతేడాది ఆగస్టులో హిండెన్ బర్గ్ ఆరోపించింది. అదానీ కంపెనీల్లో ఆమె భర్త ధావల్ బచ్ కు కూడా పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయని తన రిపోర్టులో పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ రిపోర్టును బచ్ దంపతులు కొట్టిపారేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
“>