Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఘటనపై (Delhi Blast) అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలికి తీస్తున్నాయి. హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన అనుమానితుడు మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మహుతికి పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ, ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండదని ఇంజెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. తోటి వైద్యులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుండడంతో భయాందోళనలో పేలుడుకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే, సంపూర్ణంగా తయారు చేయని బాంబును ముందుగానే పేలిపోయిందని, అందుకే దాని ప్రభావం కూడా పరిమితంగా ఉందని ఇంజెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మూడు రోజులపాటు అండర్‌గ్రౌండ్
పేలుడు మూడు రోజులు ముందు హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలను ఉగ్రవాద నిరోధక సంస్థలు స్వాధీనం చేసుకోవడం, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమిల్ అనే ఇద్దరు తన సహచర వైద్యులను ప్రశ్నిస్తున్నారన్న విషయం తెలుసుకొని మొహమ్మద్ ఉమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పేలుడుకు మూడు రోజులపాటు అతడు అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు. తన ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, కుటుంబ సభ్యులు కూడా అతడిని సంప్రదించలేకపోయారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబర్‌గా మారాడంటే జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న కొయల్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నామని అంటున్నారు.
పేలుడు జరిగిన సోమవారం రాత్రే కొయల్ గ్రామానికి వెళ్లిన పోలీసులు ఉమర్ ఇంటిని సోదా చేశారు. అతడి తల్లి, ఇద్దరు సోదరులను అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి శరీర నమూనాలతో సరిపోల్చడానికి తల్లి డీఎన్ఏ నమూనాలను సేకరించినట్టు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఉమర్ తండ్రిని కూడా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి డీఎన్ఏ శాంపుల్స్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. నిజానికి సోమవారమే ఉమర్ తండ్రిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ, అతడి మానసిక పరిస్థితి కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు.
Read Also- Delhi Blast: ఎవరీ అహ్మద్ మాలిక్?.. బ్యాంకు సెక్యూరిటీ గార్డుకి, ఢిల్లీ పేలుడుకు సంబంధం ఏంటి?
మృతుల సంఖ్య 10కి చేరిక
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఒకరు మంగళవారం సాయంత్రం చనిపోయారు. దీంతో, మృతుల సంఖ్య 10కి చేరింది. ఇక, గాయపడిన 25 మంది చికిత్స పొందుతున్నారు. పేలుడు కోసం వాడిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌ను ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న నేపథ్యంలో, అతడి తల్లి, ఇద్దరు సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్‌లను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రే అదుపులోకి తీసుకున్నారు.
