Kangana Ranaut: బాలీవుడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలిగా తన ప్రయాణంపై ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది కాలంలో కొన్ని కఠినమైన సత్యాలను తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ఎంపీ పదవిపై అసంతృప్తిగా ఉన్నారా? అని ప్రశ్నించగా కంగనా స్పందిస్తూ, ఎంపీగా పని మొదలుపెట్టినప్పుడు అంతపెద్ద కష్టమేమీ కాదనుకున్నానంటూ ఆమె చెప్పారు. ఎంపీకి అంత డిమాండ్ ఉండదేమో అని భావించానని, కానీ, అలా అనుకోవడం తప్పు అయ్యిందని ఆమె పేర్కొన్నారు. ఏడాదికి 60–70 రోజులు పార్లమెంట్‌కు కేటాయిస్తే సరిపోతుందని అప్పట్లో భావించాను. మిగతా సమయాన్ని నేను నా పని కోసం వినియోగించవచ్చని అనుకున్నాను. కానీ, ఎంపీ పదవి అధికంగా శ్రమ పడాల్సిన బాధ్యత’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అనుసంధానం
ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు మధ్య అనుసంధానకర్తలని కంగనా వ్యాఖ్యానించింది. ‘‘ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత మాదే. నియోజకవర్గాల సమస్యలను కేంద్రానికి తెలియజేసే బాధ్యత కూడా మాదే. నా చేతుల్లో కేబినెట్ లేదు, బ్యూరోక్రసీ కూడా లేదు. డిప్యూటీ కమిషనర్లతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకొని పరిస్థితిని సమీక్షించడం మాత్రమే నేను చేయగల పని’’ అని స్పష్టంగా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గంలో సమస్యలపై కూడా ఆమె స్పందించింది. జనాలు చాలా సార్లు వారి సమస్యలతో తన వద్దకు వస్తున్నారని, వాటిపై తనకు అధికారం లేకున్నా, పరిష్కరిస్తానంటూ చెప్పి పంపాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యానించింది.
Read Also- Mia Zelu: ఆమె అసలు మనిషే కాదు.. ఫొటోలు చూసి నమ్మకండి
కంగనపై కాంగ్రెస్ విమర్శలు
ఎంపీగా కంగన రనౌత్ విఫలమయ్యారంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలంలో ఆమె చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి (కాంగ్రెస్) మాట్లాడుతూ, ఎంపీ బాధ్యతలపై అసంతృప్తిగా ఉంటే, కంగన రనౌత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 30-జూలై 1 మధ్య రాత్రి హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో సంభవించిన 10 కుంభవృష్టి వర్షాల కారణంగా భారీగా వరదలు ఏర్పడ్డాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 15 మంది మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో, 27 మంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు విస్తృతంగా చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్ర విషాదం నేపథ్యంలో బాధిత ప్రాంతాలను సందర్శించిన కంగన రనౌత్, వరద ఉపశమన, పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీగా తాను ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి తాను సమాచారం అందించి, సాయం కోరగలుగుతానని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో అధికార పార్టీ మండిపడింది.
కాగా, ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ఒక్కటి మాత్రమే విడుదలైంది. అది కూడా జులై 2024కి ముందే షూటింగ్ పూర్తయింది. కొత్తగా ఎలాంటి సినిమా ప్రాజెక్ట్‌ను ఆమె మొదలుపెట్టలేదు. అయితే, త్వరలోనే హాలీవుడ్‌లో మొట్టమొదటి సినిమా చేయనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ఆఫర్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also- AirIndia Crash: ఎయిరిండియా క్రాష్‌కు కారణం ఇదేనా!.. అస్సలు ఊహించలేదు!