Jasprit Bumrah: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రా దూరమైన సంగతి తెలసిందే. సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ పై 3 మూడు టెస్టులు ఆడిన బుమ్రా.. ఐదో టెస్టు ఎంతో కీలకమైనప్పటికీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో 119.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టడం విశేషం.
48 టెస్టుల్లో.. 219 వికెట్లు
ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో బుమ్రా లేకపోవడంపై శుక్రవారం బీసీసీఐ స్పందించింది. ‘ఇంగ్లాండ్‌తో ఐదవ టెస్టుకు బుమ్రాను భారత జట్టులో నుండి విడుదల చేస్తున్నాం’ అంటూ ప్రకటించింది. కాగా ఇంగ్లాండ్ పై ఆడిన మూడు టెస్టుల్లో రెండు సార్లు ఐదు వికెట్లను బుమ్రా పడగొట్టడం విశేషం. హెడింగ్లీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో, మూడవ టెస్టు అయిన లార్డ్స్ లో బుమ్రా ఈ 5 వికెట్ హాల్ ను సాధించాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా కెరీర్ లోనే తొలిసారి 100 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటివరకూ 48 టెస్టులు ఆడిన బుమ్రా… 219 వికెట్లు పడగొట్టడం విశేషం.
బుమ్రా ఏ ఫార్మాట్‌లో ఆడతాడు?
భారత్ త్వరలో ఆసియా కప్ టీ20 టోర్నమెంటులో ఆడనుంది. అది ముగిసిన వారం రోజుల్లోనే వెస్టిండీస్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ మెుదలు కానుంది. ఇటీవల విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ సెప్టెంబర్ 29న ముగియనుంది. వెస్టిండీస్ తో తొలి టెస్ట్ అక్టోబర్ 2న అహ్మదాబాద్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 10-14 వరకు ఢిల్లీలో రెండో టెస్ట్ జరగనుంది. ఆ తర్వాత నవంబరులో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రాకు ఉన్న ఫిట్ నెస్ సమస్యల కారణంగా వెంట వెంటనే రెండు ఫార్మెట్లలో(టీ20, టెస్టు) అతడ్ని ఆడించడం కష్టమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ఆసియా కప్ కు దూరం?
‘బుమ్రాను ఆసియా కప్ ఆడించాలా? లేదా టెస్ట్ క్రికెట్ కు ఎంపిక చేయాలా? అన్నది ఒక క్లిష్టమైన నిర్ణయం అవుతుంది. అయితే బుమ్రాకు టెస్టు క్రికెట్ అంటే ఇష్టం. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లలో భారత్ వెనకబడి ఉంది. టీ20 విషయానికి వస్తే అతడు జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడవచ్చు. అది టీ20 వరల్డ్ కప్‌కి రిహార్సల్‌లా ఉంటుంది. ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకుంటే బుమ్రా.. ఆసియా కప్ ఆడకపోవచ్చు’ అని భారత సెలక్షన్ ప్రక్రియకు సంబంధించిన ఒక బీసీసీఐ అధికారి అన్నారు.
Also Read: Gold Rate Today: అమ్మబాబోయ్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. అందరి ఆశలు గల్లంతు!
నిర్ణయం.. గంభీర్, అగార్కర్‌దే!
“ఒక వేళ బుమ్రా ఆసియా కప్ ఆడి భారత్ ఫైనల్‌కు చేరితే ఆయన వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ టెస్టులో ఆడే అవకాశం ఉండదు. అప్పుడు మరో ప్రశ్న ముందుకు వస్తుంది. వెస్టిండీస్‌తో టెస్టుకు బుమ్రా అవసరమా? ఆసియా కప్ లో అతడ్ని ఆడించి 2 నెలల రెస్ట్ తర్వాత అతడ్ని దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టులు ఆడించొచ్చు. ఈ నిర్ణయం అజిత్ ఆగార్కర్, గౌతమ్ గంభీర్ తీసుకోవాల్సి ఉంటుంది’ సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.