IRCTC Song: ప్రపంచం వేగంగా డిజిటల్ యుగం వైపు పరుగులు తీస్తున్న వేళ, ప్రభుత్వ విభాగాలు ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని, పారదర్శకతను, పనుల వేగాన్ని పెంచాల్సిన సమయం ఇది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, బ్లాక్‌చైన్ వంటి టెక్నాలజీలు ప్రజాసేవ, హెల్త్, ఎడ్యుకేషన్‌తో పాటు దాదాపు అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో భారత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విభాగాలు చాలా ముందున్నాయని ఐఆర్‌సీటీసీ చాటిచెప్పింది. భారతీయ ఆవిష్కరణల్లో ఒక మైలురాయిని అందుకుంటూ, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన ఒక ప్రత్యేక గీతాన్ని (IRCTC Song) విడుదల చేసింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రభుత్వ సంస్థగా ఐఆర్‌సీటీసీ నిలిచింది. ఈ పరిణామం భారతదేశంలో టెక్నాలజీ వినియోగానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది.
Read Also- Begging Act: భిక్షాటన నిరోధక చట్టానికి సవరణ చేసిన ఏపీ ప్రభుత్వం!.. ఇకపై ఈ పదాలు వాడడానికి వీల్లేదు
ఈ చారిత్రక ప్రాజెక్ట్, భారతదేశ సంస్కృతి, టెక్నాలజీ సామర్థ్యం మేళవింపును చాటిచెబుతోంది. ఏఐ పురోగతికి, మానవ సృజనాత్మకత జత కలిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఐఆర్‌సీటీసీ చాటిచెప్పింది. మొత్తంగా డిజిటల్ సృజనాత్మకతలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్టు అయింది. ఈ పాటను కోకీ టీటీఎస్ (Coqui TTS), మాగ్నెటా ఏఐ (Magenta AI) మోడల్స్ ఉపయోగించి రూపొందించారు. ఈ పాటకు పూనమ్ గుప్తా సాహిత్యాన్ని అందించగా, ఐఆర్‌సీటీసీ టీమ్ సృజనాత్మకతో కూడిన దర్శకత్వం వహించింది. దీంతో, ప్రభుత్వ రంగ సంస్థలు సైతం అత్యాధునిక టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవచ్చో ఈ పాట తెలియజేస్తోంది.
Read Also- Gold Repatriation: యూకే నుంచి 274 టన్నుల బంగారం పట్టుకొచ్చిన ఆర్బీఐ.. ఎందుకు?, ఏం జరగబోతోంది?
ఉన్నతాధికారుల ప్రశంసలు
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఐఆర్‌సీటీసీ ఒక ప్రత్యేక పాటను రూపొందించడంపై ప్రశంసలు వెలువడుతున్నాయి. ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్, డైరెక్టర్ (మార్కెటింగ్, టూరిజం) రాహుల్ భాగస్వామ్య బృందాలకు అభినందనలు తెలిపారు. సాంకేతికత, దార్శనికతల మేళవింపుతో కథలు తయారు చేసే విధానానికి ఇదొక పునర్నిర్వచమని కొనియాడారు. ఈ పాటకు రిలిక్స్ అందించిన పూనమ్ గుప్తా మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణ ఐఆర్‌సీటీసీకి మాత్రమే కాకుండా, భారతదేశానికి సైతం గర్వకారణమని అభివర్ణించారు. సంగీత రూపకల్పనలో ఒక ప్రభుత్వ సంస్థ ఏఐని ఉపయోగించి అద్భుత ప్రయోగం చేపట్టిందన్నారు. నిజానికి తొలుత ఒక టెస్టింగ్ మాదిరిగా మొదలైన ఈ ప్రయత్నం, ఆవిష్కరణగా మారిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.
కాగా, ప్రత్యేక గీతాన్ని రూపొందించిన బృందం దీనిని ఒక బిజినెస్ మోడల్‌గా భావిస్తోంది. వివిధ పరిశ్రమలకు కార్పొరేట్ గీతాలు, వాయిస్‌ఓవర్లు, కథనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక బృందం, క్రియేటివిటీ టీమ్‌తో కలిసి ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, మొట్టమొదటి హైడ్రోపవర్ సంస్థలలో ఒకదాని కోసం ఒక కార్పొరేట్ ఆడియో-విజువల్‌ను (AV) రూపొందిస్తున్నారు.
