Begging Act: రాష్ట్రంలో భిక్షాటనను నిషేధిస్తూ 1977లో తీసుకొచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించి కొత్తగా ఏపీ భిక్షాటన నిరోధక (సవరణ) చట్టం- 2025ను ( Andhra Pradesh Prevention of Begging (Amendment) Act, 2025) తీసుకొచ్చింది. ఈ చట్టంపై రాష్ట్ర గవర్నర్ సంతకం చేయడంతో, చట్టానికి సంబంధించిన ఉత్తర్వును అక్టోబర్ 27న సర్కారు విడుదల చేసింది. అసలు ఏంటీ సవరణ చట్టం?, 1977 నాటి భిక్షాటన నిరోధక చట్టానికి, దీనికి వ్యత్యాసం ఏమిటి?, ఏ అంశాన్ని సవరించారు?.. ఈ కథనంలో చూద్దాం.
అవమానకర పదాలు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక చట్టం-1977లో అవమానకరంగా ఉన్న రెండు పదాలను చట్ట సవరణ-2025 ద్వారా తొలగించారు. పాత చట్టంలో మనుషుల ఆరోగ్య స్థితిని తెలియజేసేందుకు వాడిన పదాలు అవమానించే రీతిలో ఉన్నాయి. కుష్ఠు వ్యాధితో బాధపడే వ్యక్తిని సూచించడానికి ‘కుష్ఠిరోగి’ అని, మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తిని సూచించడానికి ‘మానసిక రోగి’ అని ప్రస్తావించారు. ఇందుకోసం లెపర్ (కుష్ఠి రోగి), లునాటిక్ (మానసిక రోగి) పదాలను ఉపయోగించారు. ఆ పదాలు వ్యక్తుల గౌరవాన్ని, సమానత్వపు హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండడంతో సున్నితమైన, గౌరవప్రదమైన పదాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Read Also- YS Sharmila: మెుంథాతో ఏపీకి అపార నష్టం.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్రాన్ని షర్మిల డిమాండ్
చట్టంలోని క్లాజ్ ఏలో ‘ఒక కుష్ఠురోగి లేదా, ఒక మానసిక రోగి’ అని ఉన్న పదాల స్థానంలో, కుష్ఠు వ్యాధి ప్రభావిత వ్యక్తి, మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తి’ అనే పదాలను చేర్చారు. చట్టంలోని క్లాజ్-ఏ లోని సబ్ క్లాజ్-1లో కూడా కుష్ఠురోగి స్థానంలో కుష్ఠువ్యాధి ప్రభావిత వ్యక్తి అని, కుష్ఠురోగి ఆశ్రమం స్థానంలో కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల ఆశ్రమం అనే పదాలను ప్రవేశపెట్టారు. క్లాజ్-బీలో మానసిక రోగుల ఆశ్రమం, మానసిక రోగి అని ఉన్నచోట కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, మానసిక వ్యాధి ప్రభావిత వ్యక్తుల ఆశ్రమంగా మార్చారు. వైద్యరంగంలో, అలాగే పేషెంట్లను ఇకపై ఈ పేర్లతోనే పిలవాల్సి ఉంటుంది. అలాగే ఆశ్రమాల పేర్లు కూడా ఈమేరకు మార్చాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక చట్టం, 1977 పేరుని కూడా ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక సవరణ చట్టం-2025 మార్చుతున్నట్టు తెలిపింది. ఈ పదాలు కుష్ఠు వ్యాధిగ్రస్తులు, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తల పట్ల వివక్షపూరితంగా (Discriminatory) ఉండడంతో, వీటిని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. వివక్షాపూరితమైన ఈ పదాలను తొలగించడం ద్వారా, వారి పట్ల గౌరవాన్ని కాపాడడం, పాతకాలం నాటి పదాలకు చరమగీతం పాడి ఆధునిక భాషా పదాలను ఉపయోగించి, తద్వారా వికలాంగుల హక్కులను పరిరక్షించడం ఈ సవరణ ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Read Also- Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 9 నెలల వరకు రోడ్ బ్లాక్?
భిక్షాటన చట్టం ఏం చెబుతోంది?
భిక్షాటన నిరోధక సవరణ చట్టం-1977 ప్రకారం, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో భిక్షాటన చేయడం నేరం. పిల్లల్ని, లేదా ఇతరులని భిక్షల కోసం ఉపయోగిస్తే కటకటాలపాలు కావాల్సి ఉంటుంది. అడుక్కోవడం కోసం జనాలకు జాలి కలిగేలా గాయాలు చేసుకోవడం, అనారోగ్య పరిస్థితి, లోపాలు, మనుషులను భయభ్రాంతులకు గురిచేయడం కూడా ఈ చట్టం కింద నిషిద్ధం. అంతేకాదు, భిక్షాటన చేసేవారికి సహకరించడం, ప్రేరేపించడం, ఎవరినైనా ఉపయోగించుకోవడం కూడా నేరమే. భిక్షాటనపై ఈ ఆంక్షల వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. బెగ్గింగి మాఫియాను నిరోధించడం, పిల్లల వినియోగం, మనుషుల అక్రమ రవాణాను నివారించడం లక్ష్యాలుగా ఉన్నాయి.
సవాళ్లు ఇవే..
భిక్షాటన నిషేధం సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడినది కావడంతో, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, నిరాశ్రయులు, మానసిక అనారోగ్యం, వ్యవస్థాపరమైన లోపాలు ఇందుకు కారణమవుతున్నాయి. బెగ్గింగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాల కారణంగా భిక్షాటన నిరోధం పూర్తిస్థాయిలో సాధ్యంకావడం లేదు.
