Indian Boycott: ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికిన టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి. భారతీయ పౌరులు సైలెంట్‌గా, చాలా బలంగా బుద్ధి చెబుతున్నారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఈ రెండు దేశాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. భారతీయుల ఈ జాతీయ భావం టర్కీ, అజర్‌బైజాన్‌ల పర్యాటక రంగంలో ఊహించని ప్రభావం చూపింది. ఆ రెండు దేశాల పర్యాటక గణాంకాలను పరిశీలిస్తే, భారతీయులు ఎంత సైలెంట్‌గా ఆ రెండే దేశాలను బహిష్కరిస్తున్నారో స్పష్టమవుతోంది.
భారీగా తగ్గిన పర్యాటకులు
ఆపరేషన్ సిందూర్ అనంతరం, అంటే.. మే నుంచి ఆగస్టు నెల వరకు టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు వెళ్లిన భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయమైన పడిపోయింది. అజర్‌బైజాన్‌కు వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 56 శాతం వరకు పతనమైంది. గత కొన్నేళ్లుగా భారతదేశాన్ని తమ కీలక మార్కెట్‌గా మార్చుకొని భారీ ఆదాయాన్ని గడించిన అజర్‌బైజాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే, ఆగస్టు 2025లో అక్కడికే వెళ్లిన భారతీయ టూరిస్టుల సంఖ్య ఏకంగా 72 శాతం మేరకు క్షీణించింది. దీనిని బట్టి ఆ దేశానికి ఎలాంటి దెబ్బ తగిలిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక, టర్కీని సందర్శించిన భారతీయ పర్యాటకుల సంఖ్య సుమారుగా 33.3 శాతం పడిపోయింది. నిజానికి, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లడానికి టర్కీ ఒక ప్రధాన ఏవియేషన్ హబ్‌గా ఉన్నప్పటికీ, భారతీయులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారనడానికి ఇదే నిదర్శనం. ఈ దేశాలకు పర్యాటకానికి సంబంధించిన బుకింగ్స్ ఏకంగా 60 శాతం వరకు తగ్గాయి. ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌ల రద్దు ఏకంగా 250 శాతం వరకు పెరిగాయని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. తద్వారా భారతీయ ప్రజలు టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు ఆర్థికంగా గట్టి ప్రతిస్పందన ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది.
బహిష్కరణ వెనుక కారణాలు ఇవే!
ఆపరేషన్ సిందూర్ సమయంలో దాయాది పాకిస్థాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. దీంతో, భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆగ్రహాన్ని కేవలం సోషల్ మీడియా నినాదాలకు మాత్రమే పరిమితం చేయలేదు. వాస్తవరూపంలోకి కూడా తీసుకొచ్చారు. తమ దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన దేశాల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు భారతీయ పర్యాటకులు సుముఖత చూపలేదు. పౌరుల స్వీయ-నియంత్రణతో కూడిన దేశభక్తిని ఈ పరిణామం చాటిచెబుతోంది.
Read Also- Constable Murder Case: కానిస్టేబుల్ హత్య కేసులో వీడిన సస్పెన్స్.. దొరికిన నిందితుడు రియాజ్
ట్రావెల్ ఏజెన్సీల తోడ్పాటు
దేశ ప్రజలకు తోడు ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip), మేక్‌మైట్రిప్ (MakeMyTrip) వంటి పెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్ ఈ విషయంలో చొరవచూపాయి. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు సంబంధించిన బుకింగ్ ప్రమోషన్లను నిలిపివేశాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని కస్టమర్లకు సలహా ఇచ్చాయి.
భారతీయ పర్యాటకుల ద్వారా పర్యాటక ఆదాయం టర్కీ, అజర్‌బైజాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో కీలకం. ముఖ్యంగా అజర్‌బైజాన్ గత కొన్నేళ్లలో భారతీయుల ఆదాయంపై బాగా ఆధారపడుతోంది. చాలామంది భారతీయుల పెళ్లిళ్లు, సమావేశాలు, ఎగ్జిబిషన్లు, కాన్షరెన్సులు వంటి కార్యకలాపాలకు గమ్యస్థానంగా ఉండేది. ఈ విధంగా టర్కీ, అజర్‌బైజాన్‌లకు భారతీయ పర్యాటకులు ఏటా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ పతనం ఆ రెండు దేశాల ఆతిథ్య, విమానయాన రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
