ISI Network Exposed: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam terror attack) తర్వాత దేశంలోని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు, గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తుల గుర్తింపు ప్రక్రియలో భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ రహస్య గూఢచర్యం నెట్‌వర్క్‌ను ఏజెన్సీలు గుర్తించాయి. కీలక వివరాలను బట్టబయలు చేశాయి. ఇండియన్ సిమ్ కార్డులు, హనీ ట్రాప్ ఎత్తుగడలు, అనేక రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ ద్వారా ఈ భారీ రహస్య నెట్‌వర్క్‌లను నిర్వహించినట్టు ఏజెన్సీలు తేల్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా ఏజెన్సీలు ఈ వేట మొదలుపెట్టగా, ఇప్పటివరకు చాలా నెట్‌వర్కులను బట్టబయలు చేశాయి.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు
హర్యానాలోని హిసార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ అరెస్టుతో ఐఎస్ఐ ఏజెంట్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. ఇండియన్ యూట్యూబర్ ముసుగులో పాకిస్థానీ ఏజెంట్‌గా మల్హోత్రా పనిచేస్తున్నట్టు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆమె కమ్యూనికేషన్‌పై నిఘా ఉంచగా విదేశీ లింకులు నిర్ధారణ అయ్యాయి. అందుకే, మల్హోత్రా కదలికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా నిఘా ఉంచి, కీలక సమయంలో అదుపులోకి తీసుకుంది. పాకిస్థానీ హ్యాండ్లర్లతో మల్హోత్రా పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు విచారణలో బయటపడింది. భారత భద్రతా బలగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సున్నితమైన, కీలకమైన సమాచారాన్ని ఐఎస్ఐతో పంచుకున్నట్టు మల్హోత్రా అంగీకరించింది. వ్యూహాత్మక డేటాను లీక్ చేసేందుకు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు కూడా అందుకున్నట్లు భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Read this- RT76: రవితేజ 76వ సినిమా ప్రారంభమైంది.. ఎయిర్ క్రాఫ్ట్ సీటులో లుక్ అదిరింది!
ఢిల్లీలో స్లీపర్ సెల్ కుట్ర భగ్నం
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు హసీన్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంతో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్ బయటపడింది. ఐఎస్ఐ సూచనల మేరకు భారీ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు హసీన్ వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు నాలుగు భారతీయ సిమ్ కార్డులను కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆ నంబర్లు ఉపయోగించి భారతీయ పౌరులు, ముఖ్యంగా భద్రతా ఏజెన్సీలతో సంబంధం ఉన్న వారిని హనీ ట్రాప్ చేస్తున్నట్టు వెల్లడైంది. హసీన్ పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చాడని, తన బంధువుల ఫోన్లు ఉపయోగించి ఐఎస్ఐ హ్యాండ్లర్లతో మాట్లాడాడని తేలింది. ప్రత్యక్షంగా తనను ఎవరూ గుర్తించకుండా హసీన్ ఈ ఎత్తుగడ వేశాడని తెలిపారు. హసీన్ సహచరుడు ఖాసీంను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
150 పాకిస్థానీ కాంటాక్ట్స్ గుర్తింపు
పంజాబ్‌కు చెందిన మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్టుతో మరికొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించి పాకిస్థాన్‌లో ఉంటున్న 150 మందికి పైగా వ్యక్తులతో తరచూ మాట్లాడేవాడని భత్రతా ఏజెన్సీలు గుర్తించాయి. డానిష్ అనే అనుమానిత హ్యాండ్లర్‌ను జస్బీర్ సింగ్ చాలాసార్లు కలిశాడని గుర్తించారు. ఒక మత పండుగ సందర్భంగా పాకిస్థానీ జాతీయులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసుకున్నాడని బయటపడింది.
Read this- DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే?
మహారాష్ట్రలో హనీట్రాప్
మహారాష్ట్ర ఏటీఎస్, కేంద్ర సంస్థలు ఉమ్మడిగా రంగంలోకి దిగి మరో గూఢచర్యం నెట్‌వర్క్‌ను గుర్తించాయి. భారతీయ పౌరులమని చెబుతున్న కొందరు మహిళలు ఏజెంట్లు, రవి వర్మ అనే వ్యక్తి లక్ష్యంగా భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించినట్టు విచారణలో గుర్తించారు. ఈ మహిళా ఏజెంట్లు దేశ రక్షణ రంగానికి సంబంధించిన వెబ్‌సైట్‌ల సున్నిత సమాచారం, ఫొటోలను పంపించినట్టు బయటపడింది. ఇందుకోసం ఐదు నుంచి ఆరు వరకు ఇండియన్ సిమ్ కార్డులను ఉపయోగించారు. విదేశీ కమ్యూనికేషన్లను ముసుగు చేయడానికి భారతీయ టెలికాం మౌలిక సదుపాయాలు ఎలా దోపిడీ చేయబడుతున్నాయనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఘటన తర్వాత పాత సిమ్ యాక్టివ్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత గతంలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అనేక భారతీయ ఫోన్ నంబర్లు యాక్టివ్ అయ్యినట్టు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నంబర్లు ద్వారా ఎన్‌క్రిప్టెడ్ మెసేజులు, అనుమానాస్పద లావాదేవీలు కూడా జరిపినట్టు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, అసోం రాష్ట్రాల అంతటా ఈ తరహా అధునాతన గూఢచర్య నెట్‌వర్క్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇదిలావుంచితే, దేశంలో ఐఎస్ఐ ఏజెంట్లు ఉండడం, వరుస అరెస్టులపై జాతీయ భద్రతా సంస్థలు ఏజెన్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ మద్దతున్న ఏజెంట్లు, నెట్‌వర్కుల కింద పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం ముప్పుగా పరిగణిస్తున్నాయి. భారతీయ సిమ్ కార్డులు, స్లీపర్ సెల్ వ్యూహాల వైపు ఎవరూ మొగ్గుచూపకుండా నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడంపై ఏజెన్సీలు మరింత దృష్టిసారించాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే తమకు సమాచారం ఇవ్వాలని భద్రతా ఏజెన్సీలు కోరుతున్నాయి. కాగా, ఐఎస్ఐ ఏజెంట్ల ఏరివేత ప్రక్రియలో మరికొందరు వ్యక్తులు అరెస్టయ్యే సూచనలు ఉన్నాయి.