Ganesh Chaturthi Trains: దేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. సొంతూర్లకు వెళ్లి కుటుంబ సమేతంగా గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే.. చవితి కోసం అదనంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రైళ్ల వివరాలను తెలియజేస్తూ తాజాగా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
380 స్పెషల్ ట్రైన్స్..
వినాయక చవితి రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచినట్లు తెలిపింది. 2023లో చవితి కోసం 305 స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేయగా.. 2024లో దానిని 358కి పెంచింది. అయితే ఈ ఏడాది రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాతో ప్రత్యేక రైళ్ల సంఖ్యను 380కి పెంచినట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఆ జోన్‌లోనే అత్యధికం
రైల్వే మంత్రిత్వశాఖ ప్రకారం.. సెంట్రల్ రైల్వేలో అత్యధికంగా 296 సర్వీసులు నడపనున్నారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో భారీగా ఉండే పండుగ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేశారు. అలాగే వెస్టర్న్ రైల్వేలో 56 సర్వీసులు, కొంకణ్ రైల్వే 6 సర్వీసులు, సౌత్ వెస్టర్న్ రైల్వేలో 22 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
Also Read: SC on Stray Dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు.. ఈసారి ఏం చెప్పిందంటే?
ఇప్పటికే అందుబాటులోకి..
గణపతి పూజలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని గణపతి ప్రత్యేక రైళ్లు ఇప్పటికే ఆగస్టు 11 నుంచి అందుబాటులోకి వచ్చాయి. పండుగ సమీపించేకొద్దీ సర్వీసుల సంఖ్య మరింత పెంచే అవకాశముందని ఇప్పటికే రైల్వే వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ పండుగ రద్దీ రోజుల్లో టికెట్‌లు ముందే బుక్ చేసుకోవడం ఎంతో అవసరం. అందుకే ప్రతి రైలు టైమింగ్‌లు, ఆగే స్టేషన్లు, టికెట్ వివరాల కోసం మీరు www.enquiry.indianrail.gov.in లేదా NTES యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి.
Also Read: Rajiv Gandhi Civils Abhaya Hastham: యువతకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరు రూ.లక్ష పొందే.. అద్భుతమైన స్కీమ్!
వెలంకన్నికి స్పెషల్ ట్రైన్స్
వినాయక చవితి తర్వాత వచ్చే వెలంకన్ని పండుగను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. వాస్కోడిగామా – వెలంకన్ని మధ్య ఆగస్టు 27, సెప్టెంబర్ 1, 6 తేదీల్లో ప్రత్యేక రైలును నడపనుంది. 07361 నెంబర్ ట్రైన్ వాస్కో నుంచి ఆగస్టు 27, సెప్టెంబర్ 1, 6 తేదీల్లో రాత్రి 9:55కి బయలుదేరి, మూడవ రోజు ఉదయం 3:45కి వెలంకన్ని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 29, సెప్టెంబర్ 3, 8 తేదీల్లో వెలంకన్ని నుంచి రాత్రి 11:55కి బయలుదేరి, మూడవ రోజు ఉదయం 3:00కి వాస్కోకు చేరుతుంది. ఈ ట్రైన్ మడగావ్, హుబ్బళ్లి, బెంగుళూరు SMVT, సేలం, తంజావూరు, నాగపట్నం వంటి ప్రముఖ స్టేషన్ల వద్ద ఆగనుంది.