India Warns Bangladesh: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ‘ఇంక్విలాబ్ మంచా’ పేరిట విద్యార్థి సంఘాన్ని స్థాపించిన ఆ దేశ విద్యార్థి సంఘం నాయకుడు ఉస్మాన్ హదీ ఇటీవల హత్యకు గురైన తర్వాత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. అతడిని భారత ఇంటెలిజెన్సీ చంపించిందంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక నిరసనలను పెద్దఎత్తున చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని నాలుగైదు రోజులక్రితం అత్యంత దారుణంగా మూకదాడి చేసి చంపేశారు. దైవదూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అనాగరిక చర్యకు పాల్పడ్డారు. ఇక, గురువారం నాడు కూడా అమృత్ సామ్రాట్ మండల్ అనే హిందూ యువకుడిని కూడా దారుణంగా కొట్టి చంపారు. దీంతో, అక్కడి హిందువుల పరిస్థితిపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్‌కు కేంద్రం హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వ్యక్తులపై వరుసగా జరుగుతున్న మూకదాడులపై కేంద్రం ప్రభుత్వం (India Warns Bangladesh) శుక్రవారం (డిసెంబర్ 26) స్పందించింది. హిందూ మైనారిటీకి చెందిన వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతుండడం విచారకరని, ఇలాంటి జరగడానికి వీల్లేదని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. వారాంతపు ప్రెస్‌మీట్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. సరిహద్దు వెంబడి చోటుచేసుకుంటున్న పరిణామాలను సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. ఈ దాడులను అంత తేలికగా పక్కనపెట్టలేమని స్పష్టం చేశారు. హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. నిందితులను గుర్తించి, శిక్షిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించింది.
వారం రోజుల్లో ఇద్దరి హత్య
బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని దారుణ రీతిలో మూకదాడి చేసి చంపేశారు. దీపు చంద్ర దాస్ దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాశవిక దాడి చేశారు. దీపు దాస్ సహోద్యోగి దాడికి ప్రేరేపించగా, ఒక సమూహంపై దాడి చేసి చంపడమే కాకుండా, శవాన్ని ఉరితీసి నిప్పు పెట్టారు. అక్కడున్నవారు వీడియోలు తీసి సంతోషించారు. అసలు విషయం ఏమిటంటే, దీపు చంద్రదాస్ దైవదూషణకు పాల్పడినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
Read Also- KTR and Kavitha: కవిత మాటలకు కేటీఆర్ కౌంటరా? మౌనమా? నాగర్‌కర్నూల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరుబాట!
ఈ ఘటన మరచిపోకముందే, గురువారం నాడు 29 ఏళ్ల అమృత్ మండల్ (Amrit Mandal) అలియాస్ సామ్రాట్ అనే మరో హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టి హతమార్చారు. రాజ్‌బారి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ‘సామ్రాట్ బాహిని’ అనే నేరగాళ్ల ముఠాకు అమృత్ మండల్ నాయకుడని, ఇది వసూళ్లకు పాల్పడే ముఠా అని స్థానికులు అంటున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత సామ్రాట్ దేశం విడిచి పారిపోయాడని, ఇటీవలే తన సొంత గ్రామం హోసేన్‌దంగాకు తిరిగి వచ్చాడని వివరించారు. బుధవారం రాత్రి తన ముఠా సభ్యులతో కలిసి గ్రామంలోని షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయగా, ఆ కుటుంబ సభ్యులు కేకలు వేశారని, దీంతో గ్రామస్థులంతా ఏకమై సామ్రాట్‌ను పట్టుకుని దౌర్జన్యంగా కొట్టారని సమాచారం.

