S-400 Air Defence Systems: ఇటీవల భారత్ – పాక్ (India Pak War) మధ్య చెలరేగిన ఉద్రిక్తతల్లో మన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 సుదర్శన్ చక్ర ఏ స్థాయిలో సేవలు అందించిందో అందరికీ తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకొని నేల కూల్చింది. దీంతో ఒక్కసారిగా ఎస్-400 సుదర్శన్ చక్ర పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దాని శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ కు సంబంధించి భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు ఎస్-400 క్షిపణి వ్యవస్థలు!
వాస్తవానికి ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. 2018లో స్క్వాడ్రన్ల పంపిణీకి సంబంధించి భారత్ – రష్యా మధ్య 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మూడింటిని రష్యా భారత్ కు అప్పగించింది. మరో రెండు డెలివరీ కావాల్సి ఉంది. అయితే పాక్ తో యుద్ధంలో మెరుగైన ప్రదర్శన చేసిన కారణంగా కొత్తగా మరో 2 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇటీవల చైనాలోని కింగ్ డావోలో జరిగిన షాంఘై సహకర సంస్థ (SCO) సమావేశంలో రష్యా రక్షణ మంత్రితో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ చర్చించినట్లు పేర్కొన్నాయి.

పాక్, చైనాకు పెట్టడానికే!
ముందస్తు ఒప్పందం ప్రకారం రావాల్సిన రెండు S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థను 2026-27 నాటికి అప్పగిస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ (Andrey Belousov) హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంలోనే మరో రెండు S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పాక్ తో పాటు చైనాతోనూ సరిహద్దుల్లో ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలానే ఈ చర్చల్లో భారత్ సుమారు 260 ఎస్ యూ, 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు ప్రస్తావనకు వచ్చిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. వీటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే ప్లాన్‌లో భాగంగా అప్‌గ్రేడ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
S-400 సామర్థ్యాలు ఏంటీ?
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. విస్తృతమైన రేంజ్ ను కలిగి ఉంది. 600 కి.మీల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది గుర్తించగలదు. 400 కిలోమీటర్ల వరకూ మిసైళ్లను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు (F-16, F-35, సుఖోయ్-30), క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు, ఇతర హానికర వాయుసేన వస్తువులను నాశనం చేయగలదు. దీని రియాక్షన్ టైమ్ కూడా చాల తక్కువగానే ఉంటుంది. 5-10 సెకన్లలో కదులతున్న టార్గెట్ ను లాక్ చేసి నేలకూల్చకూలదు.
Also Read: Viral Video: రోడ్డుపై నడుం లోతు నీళ్లు.. ఎంచక్కా స్కూటీపై వెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్!
36 టార్గెట్లు.. ఒకేసారి ఫినిష్
S-400 ట్రయంఫ్ మెుత్తం నాలుగు రకాల క్షిపణులను కలిగి ఉంటుంది. వాటి ఛేదన పరిధి ఆధారంగా వాటిని విభజించారు. 40N6E (400 కి.మీ. పరిధి), 48N6DM (250 కి.మీ), 9M96E2 (120 కి.మీ.) 9M96E (40 కి.మీ.) పేరుతో పిలిచే ప్రతి స్క్వాడ్రన్ వాహనంలో ఉంటాయి. మరోవైపు S-400 డిఫెన్స్ సిస్టమ్.. ఒకే సమయంలో 80 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 36 టార్గెట్లను ఒకేసారి ఛేదించగలదు. అంతేకాదు ఆకాశంలో 30 మీటర్ల నుండి 30-35 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తున్న లక్ష్యాలను నాశనం చేయగలదు. డ్రోన్స్ దగ్గర నుంచి బాలిస్టిక్స్ క్షిపణుల వరకూ దేనినైనా ఈ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలదు.