K 4 Missile: దేశీయంగా ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను తయారు చేస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్న మన దేశం మరో కీలకమైన పురోగతిని సాధించింది. న్యూక్లియర్ సామర్థ్యమున్న క్షిపణులను మరింత మెరుగుపరిచే క్రమంలో సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ కే-4ను (K-4 Missile) విజయవంతంగా పరీక్షించింది. బంగాళఖాతంలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ కీలక ప్రయోగం జరిగింది. అణుసామర్థ్యం ఉన్న ఐఎన్ఎస్ అరిఘాత్ (INS Arighaat) నుంచి ఈ మిసైల్‌ని పరీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తీరం నుంచి మంగళవారమే ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినప్పటికీ, రక్షణశాఖ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది సాలిడ్-ఫ్యూయల్ క్షిపణి. దేశ అణు జలాంతర్గాములకు తిరుగులేని దాడి సామర్థ్యాన్ని అందించినట్టు అయ్యింది.
కే-4 సామర్థ్యాలు ఇవే
కే-4 క్షిపణి మధ్యస్థాయి దూరాలను ఛేదించగల ఖండాంతర క్షిపణి. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా చేధిస్తుంది. ఈ మిసైల్ అందుబాటులోకి రావడంతో సముద్ర తలాల పైనుంచి భారత అణ్వాయుధ దాడి సామర్థ్యాలు మరింత మెరుగుపడ్డాయి. నిజానికి 2024 ఆగస్టు 29న కే-4 సబ్ మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ (SLBM) ఇండియన్ నేవీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. తాజాగా, నిర్వహించిన పరీక్ష విజయవంతంగా కావడంతో భూమి, ఆకాశం, సముద్రగర్భం నుంచి అణు క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ నిలిచింది.
Read Also- Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!
గత కొన్నేళ్లుగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే వివిధ రేంజ్‌ల సామర్థ్యమున్న క్షిపణులను విజయవంతంగా పరీక్షిస్తోంది. గతేడాది ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి మొదటిసారి కే-4 క్షిపణిని ప్రయోగించారు. ఆ తర్వాత తాజాగా, మంగళవారం నిర్వహించినది రెండవ టెస్ట్. ఇది విజయవంతంగా కావడంతో కే-4 క్షిపణి వ్యవస్థ పూర్తిస్థాయి వినియోగానికి మరింత చేరువయ్యిందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
Read Also- iPhone Auction: తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం.. బెంగళూరులో భారీ గ్యాడ్జెట్ వేలం
కాగా, ఆగస్టు 2024లో ఐఎన్ఎస్ అరిఘాత్, భారత నౌకాదళంలో చేరింది. ఏకంగా 6,000 టన్నుల బరువున్న అత్యాధునిక అణు జలాంతర్గామి ఇది. 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించగలిగే కే-4 క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. కాగా, 2016లో అందుబాటులోకి వచ్చిన తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్, కేవలం 750 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించగల కే-15 క్షిపణులను మాత్రమే మోసుకెళ్లగలదు. గతంలో కే-4 పరీక్షలను నీటి అడుగున ఉండే పాంటూన్ల (pontoons) నుంచి నిర్వహించేవారు. ఇప్పుడు నేరుగా ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచే ప్రయోగించడం దేశ రక్షణ రంగంలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు 5,000 కిలోమీటర్లకు పైగా పరిధిలోని లక్ష్యాలను చేధించగల సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్‌ను (SLBM) కలిగి ఉన్నాయి.

