India – EU Free Trade Deal: దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. భారత్ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ తో కుదిరిన ఈ డీల్ ను వాణిజ్య ఒప్పందాలకు తల్లిగా ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అభివర్ణించారు. ఈ డీల్ ప్రకారం.. ఐరోపా ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలు భారత్ లో భారీగా దిగిరానున్నాయి. ఫలితంగా పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
చౌకగా లగ్జరీ కార్లు..
మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లపై భారత్ ఇప్పటివరకూ 100 శాతం సుంకాలు విధిస్తూ వస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం.. 15,000 యూరోల కంటే ఎక్కువ అంటే దాదాపు రూ.16 లక్షలు పైన ఉన్న కార్లపై 40 శాతం సుంకాన్ని విధించనున్నారు. భవిష్యత్తులో దీనిని 10 శాతానికి పరిమితం చేయనున్నారు.
తగ్గనున్న వైన్ ధరలు..
ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్ల నుంచి భారత్ కు దిగుమతయ్యే వైన్ ధరలు తాజా డీల్ కారణంగా తగ్గనున్నాయి. ఐరోపా దేశాల నుంచి దిగుమతయ్యే వైన్ బాటిల్స్ పై భారత్ ఇప్పటివరకూ 150 శాతం సుంకం విధిస్తూ వస్తోంది. కొత్త ఒప్పందం ప్రకారం దీనిని 20 శాతానికి తగ్గించనున్నారు. దీని కారణంగా వైన్ ధరలు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ఉన్న వైన్లకు ఎలాంటి సుంకం రాయితీలు వర్తించవు. ఆ పైన ఉన్న ప్రీమియం బాటిళ్లకు మాత్రమే ఈ డీల్ వర్తించనుంది.
చౌకగా ఔషదాలు..
వైద్య రంగంలో యూరప్ బాగా అభివృద్ధి చెందింది. తాజా ఒప్పందం ప్రకారం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ తదితర తీవ్ర వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతేకాకుండా భారత్ లో తయారైన ఔషధాలకు యూరోపియన్ దేశాల్లో మార్కెట్ లభించనుంది.
మెుబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు
ఈ వాణిజ్య ఒప్పందం కారణంగా యూరప్ నుండి దిగుమతి చేసుకునే విమానాల విడి భాగాలు, మెుబైల్ ఫోన్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు పూర్తిగా జీరోకు రానున్నాయి. ఇది దేశంలో గ్యాడ్జెట్ల తయారీ ఖర్చులను తగ్గించి.. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
Also Read: India EU FTA: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఉక్కు, రసాయన ఉత్పత్తులు..
ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులపై జీరో ట్యాక్స్ విధానానికి భారత్ – ఈయూ మధ్య అంగీకారం కుదిరింది. ఫలితంగా పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాలు చాలా చౌకగా లభించనున్నాయి. ఫలితంగా ఇనుముతో చేసిన పనిముట్లు, వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. మరోవైపు భారత్ లో తయారైన దుస్తులు, తోలు వస్తువులు, ఆభరణాలకు ఈయూ మార్కెట్ ఓపెన్ కానుంది.

