Boycott Turkey: భారత్ తో యుద్ధంగా పాక్ కు టర్కీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశానికి భారతీయుల సెగ గట్టిగా తగులుతోంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ కు మద్దతుగా నిలిచి టర్కీ తీరని ద్రోహం చేసిందని భారతీయులు రగిలిపోతున్నారు. గతంలో భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి వక్రబుద్దిని ప్రదర్శించిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే దేశ భక్తి కలిగిన భారత వ్యాపారులు, వినియోగదారులు టర్కీకి చెందిన ఆపిల్స్, మార్బుల్స్, టూరిజాన్ని నిషేధించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ జ్యూయలరీని సైతం బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు.
డిమాండ్ ఉన్నా.. బాయ్ కాట్!
రాజస్థాన్ లోని జోద్ పూర్ కు చెందిన జ్యూయలర్స్ అసోసియేషన్ (Jodhpur Jewellers Association) సభ్యులు.. టర్కీ ఆభరణాలను విక్రయించకూడదని నిర్ణయించారు. టర్కీ నుంచి దిగుమతయ్యే బంగారాన్ని జోద్ పూర్ లో అమ్మకూడదని అసోసియేషన్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కమిటీ అధ్యక్షుడు నవీన్ సోని తెలిపారు. టర్కీ నుంచి వచ్చే ఆభరణాలకు జోద్ పూర్ లో బాగా డిమాండ్ ఉందన్న నవీన్.. ఆ దేశం చేసిన ద్రోహానికి ప్రతీగా వాటిని అమ్మకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
లక్నోలోనూ నిషేధం
మరోవైపు యూపీలోని లక్నోకు చెందిన గోల్డ్ వ్యాపారులు (Lucknow gold traders) సైతం టర్కీ దేశ బంగారాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశం నుంచి బంగారం దిగుమతిని నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. అటు ప్రజలు సైతం టర్కీ బంగారాన్ని కొనుగోలు చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. దీంతో బంగారం విషయంలోనూ టర్కీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆపిల్స్, మార్బుల్స్, టూరిజం బాయ్ కాట్ తో ఆ దేశంపై ఆర్థికంగా పెను ప్రభావం పడిన సంగతి తెలిసిందే.
టర్కీకి పెద్ద దెబ్బే!
అయితే టర్కీ నుంచి దిగుమతయ్యే గోల్డ్ లో ఎక్కువ మెుత్తం రాజస్థాన్ లోని జోద్ పూర్ కే వెళ్తోంది. అక్కడ విక్రయించే గోల్డ్ లో టర్కీ పసిడి వాటా 10%గా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. 2024లో టర్కీ నుంచి 274 మిలియన్ డాలర్ల విలువైన ముత్యాలు, విలువైన రాళ్లు, ఆభరణాలు, లోహాలు దిగుమతి అయినట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో టర్కీ గోల్డ్ దిగుమతులు భారీగా పతనమయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు జులై 30న భారత్ లో జరిగే ఇండియన్ ఇంటర్నేషనల్ జ్యూయలరీ షోలో టర్కీ దేశానికి స్టాల్స్ కేటాయించవద్దని ట్రేడ్ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read: Samantha: సమంత రెండో పెళ్లి.. కొత్త ఇల్లు? కుండబద్దలు కొట్టిన మేనేజర్!
దేశమే మాకు ముఖ్యం
మరోవైపు టర్కీతో పాటు పాక్ కు అండగా నిలిచిన అజర్ బైజాన్ లతో అన్ని వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని భారత రత్నాభరణాల దేశయ మండలి (జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్) పిలుపు ఇచ్చింది. వాణిజ్యం కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోకడే పేర్కొన్నారు. ఆ రెండు దేశాలతో లావాదేవీలను నిలిపివేయాలని తాము ప్రతీ వ్యాపారీ, తయారీదారు, హోల్ సేల్ వ్యాపారులను కోరుతున్నట్లు ఆయన పిలుపునిచ్చారు.