Saraswati Pushkaralu: సరస్వతి నామ స్మరణతో కాళేశ్వరం త్రివేణి సంగమం మారుమోగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతి నది పుష్కరాల సందర్భంగా శుక్రవారం పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు సరస్వతి ఘాట్ చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తుల రాకతో ఘాట్ల వద్ద ఆధ్యాత్మిక చైతన్యం కనిపించింది. అధికారులు భక్తులకు మార్గనిర్దేశనం చేస్తూ, పుష్కర స్నానంతో పాటు భక్తులు నదీ తీరాల్లో హారతులు సమర్పిస్తూ, దానం చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. గురువారం 86 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా శుక్రవారం లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించారు.
పుష్కర స్నానం ఆచరించిన పరిపూర్ణా నంద స్వామి
కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల్లో శుక్రవారం కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణా నంద సరస్వతి స్వామి పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ రాజగోపురం వద్ద స్వామికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.
Also Read: CM Revanth: విద్యుత్ శాఖలో విప్లవాత్మక మార్పులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
భక్తులకు ఇబ్బందులుండొద్దు
రెండో రోజు సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ భక్తులతో సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీశారు. స్టాల్స్, టెంట్ సౌకర్యాలు, సరస్వతి ఘాట్ వద్ద భక్తులను పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, షవర్స్, ఘాట్స్, చలివేంద్రం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.
సరస్వతి పుష్కరాలు అద్భుతం: డిప్యూటీ సీఎం భట్టి
కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు అద్భుతం, అనిర్వచనీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా సరస్వతి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, పుష్కరాలు నిర్వహణ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పుష్కర స్నానంతో అవి పరిసమాప్తం అవుతాయన్నారు.
Also Read: Kishan Reddy – CM Revanth: మీ మంత్రే ఒప్పుకున్నారు.. కమీషన్ల మ్యాటర్ ఏంటి.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న