Fighter Jet Crash: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం బుధవారం రాత్రి 9.15 గంటల సమయంలో కుప్పకూలిన దుర్ఘటనలో ఒక పైలట్ మిస్సింగ్ అయ్యారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో పైలట్ విమానం కూలిపోవడానికి ముందే సురక్షితంగా బయటపడ్డారు. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానం ముక్కలుముక్కలైంది.
జామ్‌నగర్ సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్దా అనే గ్రామ సమీపంలో ఈ విమానం విమానం శకలాలు కాక్‌పిట్, తోక భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా పంట పొలాల్లో శిథిలాలు పడడంతో సామాన్య పౌరులు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తప్పిపోయిన పైలట్ కోసం అన్వేషణ మొదలుపెట్టారని జామ్‌నగర్ ఎస్పీ ప్రేమ్‌సుఖ్ వెల్లడించారు.
Also read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?
సాధారణ శిక్షణలో భాగంగా విమానం కూలిందని భారత వైమానిక దళం అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో రెండు సీట్లు మాత్రమే ఉంటాయని వివరించారు. 1970వ దశకంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ యుద్ధ విమానానికి రెండు ఇంజిన్లు ఉంటాయి. సింగిల్, రెండు సీట్ల వేరియంట్‌లతో ఈ విమానాలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఈ విమానాలను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. గత మార్చి 7న కూడా అంబాలాలో మరో జాగ్వార్ విమానం కూలింది.