Germany Good News: భారతీయ పౌరులకు జర్మనీ ప్రభుత్వం చిన్న గుడ్‌న్యూస్ (Germany Good News) చెప్పింది. భారతీయ పౌరులు వీసా లేకుండానే తమ దేశంలోని ఎయిర్‌పోర్టుల గుండా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అంతే, కొత్త ‘వీసా లేని ట్రాన్సిట్’కు (visa free transit) అవకాశం కల్పించింది. ఈ సడలింపుతో అత్యంత రద్దీగా ఉండే జర్మనీలోని ఎయిర్‌పోర్టుల్లో దిగి, విమానం మారేందుకు వీసా లేకుండానే భారతీయ పౌరులకు వెసులుబాటు ఇచ్చినట్టు అయ్యింది. నిజానికి ఎయిర్‌పోర్టుల్లో కొద్దిసేపు ఆగి, విమానం మారాలన్నా చాలా పేపర్‌వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇకపై జర్మనీ వెళ్లే ప్రయాణికులకు ఆ సమస్య ఉండదు. జర్మనీ గుండా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు గొప్ప ఊరటనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కొత్తగా వచ్చిన మార్పు ఏమిటి?
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు జర్మనీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల ద్వారా వేరే దేశాలకు వెళ్లేటప్పుడు ఇకపై ‘షెంజెన్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా’ (టైప్ ఏ షెంజెన్ వీసా) తీసుకునే అవసరం ఉండదని జర్మనీ ప్రకటించింది. ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ వంటి జర్మనీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణిస్తూ, ఇతర దేశాలకు వెళ్లే ప్యాసింజర్లకు వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది.
Read Also- BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ
ఇప్పుడే ఎందుకీ నిర్ణయం
జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ సోమ, మంగళ వారాల్లో (జనవరి 12, 13) తొలిసారి భారత్‌లో అధికారిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ఈ సమావేశంలో ఆయన కీలక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, సెమీకండక్టర్లు, మొబిలిటీ వంటి కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ఈ వ్యూహాత్మక చర్చల్లో భాగంగానే సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగేలా వీసా రహిత సౌకర్యానికి అవకాశం ఇచ్చారు.
అసలు ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి?
విమాన జర్నీలో ట్రాన్సిట్ వీసా చాలా ముఖ్యమైనది. టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసాలకు భిన్నమైనది. ఒక దేశంలోకి ప్రవేశించకుండానే, ఆ దేశం మీదుగా మరో దేశానికి వెళ్లే ప్యాసింజర్లకు దీనిని కేటాయిస్తారు. ప్యాసింజర్లు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు లేకుండా, కేవలం ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ ట్రాన్సిట్ ఏరియాలో ఉంటూ విమానాలు మారేందుకు వీలుంటుంది. సాధారణంగా ప్యాసింజర్లు విమానాశ్రయం నుంచి బయటకు రారు. అయినప్పటికీ వీసా లేకపోతే బోర్డింగ్ నిరాకరించేవారు. జర్మనీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు ఆటంకాలు తొలగిపోయాయి. సాధారణంగా జర్మనీలోని ముఖ్యమైన ఎయిర్‌పోర్టులైన ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ మీదుగా అమెరికా, కెనడా వంటి ఇతర దేశాలకు భారతీయులు వెళ్తుంటారు. కొత్త నిబంధనతో ఎలాంటి అదనపు వీసా డాక్యుమెంట్లు అక్కర్లేకుండానే విమానం మారవచ్చు.

