Pakistan Fake News: భారత సాయుధ దళాల సామర్థ్యంపై పాకిస్థాన్ మీడియా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఫ్రెంచ్ నౌకాదళం తీవ్రంగా ఖండించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయు సేనకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసినట్టుగా ఫ్రెంచ్ నౌకాదళానికి చెందిన ఓ అధికారి ధృవీకరించినట్లుగా వార్తలు ప్రసారం చేశాయి.
పాకిస్థాన్ వైమానిక దళం
సదరు ఫ్రెంచ్ అధికారి నవంబర్ 21న పాకిస్థాన్ ప్రముఖ మీడియా సంస్థ జియో టీవీ(Jio TV) ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారంటూ ఊదరగొట్టాయి. భారత్‌తో సంఘర్షణలో పాకిస్థాన్ వైమానిక దళం, ఆధిపత్యం చెలాయించిందని, భారతీయ యుద్ధ విమానాలను కూల్చి వేసిందని అధికారి ధృవీకరించారని పేర్కొన్నాయి. అంతేకాదు, చైనా జే-10సీ యుద్ధ విమానాల సాంకేతిక సామర్థ్యంతో రఫేల్ విమానం కూలిపోలేదని వ్యాఖ్యానించినట్లు కూడా ఆ కథనంలో ఉటంకించారు. అయితే, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వార్తలని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. పాక్ మీడియా దుష్ప్రచారాన్ని ఫ్రెంచ్ నేవీ తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా ఖండించింది.
Also Read: Skin Care: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయొద్దు.. వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించండి!
ప్రెజెంటేషన్‌ను వక్రీకరించి..
ఈ కథనాల్లో నిజం లేదని, తప్పుడు సమాచారమని, అంతా దుష్ప్రచారమని స్పష్టం చేసింది. అసలు ఆ అధికారి పేరు కెప్టెన్ జాక్విస్ లానే అని తప్పుగా పేర్కొంటున్నారని, ఆయన పేరు కెప్టెన్ యివాన్ లానే అని క్లారిటీ ఇచ్చింది. పాక్ మీడియా చెబుతున్నట్టుగా కెప్టెన్ లానే అలాంటి ప్రకటనలు చేయడానికి అంగీకరించలేదని, ఆయన ఇచ్చిన టెక్నికల్ ప్రెజెంటేషన్‌ను వక్రీకరించి ఈ వ్యాఖ్యలను కల్పించారని ఫ్రెండ్ నేవీ ఖండించింది. రఫేల్ విమానాలు ఉన్న నావల్ ఎయిర్ స్టేషన్‌కు నాయకత్వం వహించడం వరకే కెప్టెన్ లానే పాత్ర పరిమితమని, భారత్-పాక్ సైనిక ఘర్షణలపై ఆయనకు ఎలాంటి క్రియాశీలక అధికారం లేదని, కనీసం వ్యాఖ్యానించే అధికారం కూడా లేదని ఫ్రాన్స్ తేల్చి చెప్పింది. ఫ్రెంచ్ నేవీ ఖండనతో నిజం ఏమిటో తేలిపోయింది. దీంతో, అంతర్జాతీయంగా పాకిస్థాన్ ‘ఫేక్ న్యూస్’ మరోసారి బెడిసి కొట్టిందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?
