Shibu Soren: రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) కన్నుమూశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జార్ఖండ్ ముక్తి మోర్చ (JMM) పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. వయసు 81 ఏళ్లు కావడంతో గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. నెలరోజులకు పైగా ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. శిబూ సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తండ్రి మరణవార్తను ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘‘ప్రియమైన డిషోం గురూజీ మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఇవాళ నేను సర్వం కోల్పోయాను’’ అంటూ భావోద్వేగంతో స్పందించారు.
శిబూ సోరెన్ మరణంపై సర్ గంగారామ్ హాస్పిటల్ హాస్పిటల్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. శిబూ సోరెన్ జూన్ 19న ఆసుపత్రిలో చేరారని, నెఫ్రాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఏకే భల్లా పర్యవేక్షణలో చికిత్స పొందారని, పలురకాల వైద్య నిపుణుల బృందం అందించిన అత్యుత్తమ చికిత్సా ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. 2025 ఆగస్టు 4న శిబూ సోరెన్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని పేర్కొంది. ఆయన కుటుంబానికి, బంధువులకు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ ప్రజా నాయకుడి మృతిపై ప్రతి ఒక్కరికీ సానుభూతిని తెలియజేస్తున్నామని ప్రకటనలో ‘సర్ గంగారామ్ హాస్పిటల్’ పేర్కొంది.
పొలిటికల్ కెరియర్ ఇదే..
శిబూ సోరెన్‌కు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నలభై ఏళ్లకు పైగా ఆయన రాజకీయ జీవితం గడిపారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. రెండోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో ఆయన కన్నుమూశారు. సంతాల్ వర్గానికి చెందిన శిబూ సోరెన్, ఉమ్మడి బీహార్‌లో భాగంగా ఉన్న రామ్‌ఘడ్ జిల్లాలో జన్మించారు. 1972లో లెఫ్ట్ యూనియన్ నేత ఏకే. రాయ్, కుర్మి మహతో, బినోద్ బిహారి మహతోలతో కలిసి ‘ఝార్ఖండ్ ముక్తి మోర్చా’ పార్టీని స్థాపించారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. మొత్తంగా 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కావడంలో చిరస్మరణీయ పాత్ర పోషించారు. 1980లో ఆయన తొలిసారి లోక్‌సభకు డుమ్కా స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ ప్రాంతం జేఎంఎంకి (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) కంచుకోటగా మారింది. . అయితే, 2019లో అనూహ్యంగా డుమ్కాలోనే ఆయన ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నలిన్ సోరెన్ 45,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మూడు సార్లు సీఎం..
శిబూ సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అయితే, ఒక్క పదవీకాలాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. 2005లో తొలిసారి జార్ఖండ్ బాధ్యతలు స్వీకరించిన ఆయన, అసెంబ్లీలో బలపరీక్షలో విఫలమయ్యారు. దీంతో, కేవలం తొమ్మిది రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, మిత్రపక్షాల మధ్య సఖ్యత చెడడంతో ఆ రెండు సార్లు కూడా స్వల్ప కాలంలోనే ప్రభుత్వాలు పడిపోయాయి.
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో 2004లో కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 1974లో చిరుదిహ్ ప్రాంతంలో ఆదివాసీల-ముస్లింల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయనను రాజీనామా చేయాల్సి వచ్చింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అయితే, ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మరోసారి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ పదవీకాలం 10 రోజుల్లో ముగిసిపోవడంతో 2006లో ఆయన మళ్లీ కేంద్ర బొగ్గు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఒక ఏడాది లోపే తన మాజీ కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో దోషిగా తేలడంతో ఆయన మళ్లీ రాజీనామా చేశారు. ఒక హత్యకేసులో దోషిగా తేలిన తొలి కేంద్ర మంత్రిగా కూడా ఆయన అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించింది.
Read Also- Karnataka Mysterious: దేశంలో కలకలం.. చెల్లాచెదురుగా నెమళ్ల మృతదేహాలు.. ఏం జరిగింది?
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
శిబూ సోరెన్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘శిబూ సోరెన్ గారి మరణవార్త విని చాలా బాధగా అనిపించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఆయనను అభిమానంగా ‘గురూజీ’గా పిలిచేవారు. తండ్రిని కోల్పోయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు. ఆయన కుటుంబ సభ్యులకు, గురూజీ అనుచరులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ సంతాపం..
జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆదివాసీల హక్కులకోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం ఆయన చేసిన పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అని కొనియాడారు. శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ‘‘శిబూ సోరెన్ మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి, తీరని లోటు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్‌తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని కేసీఆర్ పేర్కొన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ను హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తుచేసుకున్నారు. నాటి తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కొడుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also- Kaleswaram: కాక రేపుతున్న కాళేశ్వరం నివేదిక.. వెలుగులోకి సంచలన నిజాలు