Sensational Case: పంజాబ్‌లో సంచలన కేసు (Sensational Case) వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా, ఆయన భార్య, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలైన రజియా సుల్తానా కొడుకు అక్విల్ (33 ఏళ్లు) మృతి కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గురువారం (అక్టోబర్ 16) పంచకులలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో పడివుండాన్ని అర్ధరాత్రి సమయంలో గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టుగా డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే, అక్విల్ మరణంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌కు బానిసయ్యే, అధిక మోతాదులో తీసుకోవడం కారణంగా మరణించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నాయి. కానీ, కొన్ని ఔషధాల వాడకంతోనే అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు అంటున్నారు. దీంతో, అక్విల్ తల్లిదండ్రులైన ముస్తఫా, రజియా సుల్తానాపై కొడుకు హత్య కేసు నమోదైంది.
అక్విల్ వీడియోతో దర్యాప్తులో కొత్త మలుపు
మృతుడు అక్విల్‌కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావడం ఈ కేసులో పెనుసంచలనంగా మారింది. తన భార్యకు, తన తండ్రికి అక్రమ సంబంధం ఉందంటూ ఆ వీడియోలో అక్విల్ ఆరోపణలు చేయడం షాకింగ్‌గా మారింది. అక్విల్ స్వయంగా ఆ వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియో, ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వాంగ్మూలం ఇవ్వడంతో అక్విల్ తల్లిదండ్రులు ముస్తఫా, రజియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనూహ్యమైన మలుపు తిరిగిన ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.
ఆగస్టు నెలలో వీడియో.. ఏం చెప్పాడంటే
అక్విల్ ఈ వీడియోను ఆగస్టు నెలలో రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఆ వీడియోలో, అఖిల్ తన తండ్రికి, తన భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. వారిద్దరి మధ్య రిలేషన్‌ను తాను కనిపెట్టానని, దాంతో తీవ్రమైన ఒత్తిడి, మానసిక క్షోభకు గురవుతున్నానని పేర్కొన్నాడు. ఏం చేయాలో తెలియడం లేదని, వాళ్లు ప్రతిరోజూ తనను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోందంటూ వాపోయాడు. తన తల్లి రజియా, ఆమె సోదరి కూడా ఈ కుట్రలో భాగమేనని అఖిల్ ఆరోపించాడు. తనను తప్పుడు కేసులో జైలుకు పంపించడం, లేదా హత్య చేయాలనేది వారి ప్లాన్ అని అక్విల్ పేర్కొన్నాడు.
Read Also- K Ramp collections: మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం ’కే ర్యాంప్’.. ఎంతంటే?
పెళ్లికి ముందే తన భార్య గురించి తండ్రికి తెలుసేమోనని అనిపిస్తోందని అక్విల్ సందేహం వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఫస్ట్ నైట్ తనను తాకనివ్వలేదని, ఎందుకంటే, ఆమె తన తండ్రిని పెళ్లి చేసుకుందని అక్విల్ ఆరోపించడం ఆ వీడియోలో ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే తాను భ్రమపడుతున్నట్టు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్టుగా చెప్పేవారని వీడియోలో వాపోయాడు. తాను సరైన వాదన చేసినప్పుడల్లా, కథనం మార్చివేస్తున్నారని పేర్కొన్నాడు. పిచ్చివాడినంటూ తనను ఒక రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించారని, తాను క్లీన్‌గా ఉన్నానని, ఈ నిర్బంధం అక్రమమని విచారించాడు. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే, డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి, కానీ ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించాడు.
తాను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నానని, ఏం చెయ్యాలో కూడా తోచడం లేదని వాపోయాడు. తనకు ఎలాంటి మానసిక రోగం లేదని నిరూపించుకోవడానికి బార్ పరీక్ష రాయడానికి కూడా సిద్ధమని, ప్రొటెక్షన్ పిటిషన్ వేయాలా? అని ప్రశ్నించాడు. తన డబ్బును కూడా లాక్కున్నారని అన్నాడు. తాను పిచ్చివాడినని చెప్పుకోవడం ద్వారా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్విల్ పేర్కొన్నాడు. వాళ్లకు వ్యతిరేకంగా తాను ఏ చర్య తీసుకున్నా హత్య కేసులో ఇరికించిస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పాడు. దయచేసి ఎవరో ఒకరు తనకు సాయం చేయాలని, రక్షించాలంటూ వీడియోలో అతడు వాపోయాడు. వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
Read Also – SP Sudhir Ramnath Kekan: పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
పోలీసులు ఏమంటున్నారంటే?
అక్విల్ మరణంపై మొదట్లో ఎలాంటి కుట్ర ఉన్నట్టుగా అనుమానించలేదని పోలీసు అధికారి సృష్టి గుప్తా చెప్పారు. కుటుంబ సభ్యులే కుట్రపన్నారంటూ, మృతిలో వారి పాత్ర ఉందంటూ ఒక ఫిర్యాదు అందిందని వెల్లడించారు. అక్విల్ సోషల్ మీడియా పోస్ట్‌లు, కొన్ని వీడియోలు, కొన్ని ఫొటోలు కూడా అనుమానాలను లేవనెత్తుతున్నాయని, వాటి ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని సృష్టి గుప్తా చెప్పారు. అక్విల్ వీడియోను తాము పోలీసులు కూడా పరిశీలిస్తున్నారని ఆమె చెప్పారు. మొహమ్మద్ ముస్తఫా, రజియా సుల్తానా, అఖిల్ భార్య, ఇతరులపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్టు వివరించారు.

