Police Flag Day: మూడు రోజుల కిందట నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం చెందారని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న ఆయన భార్య ప్రణీతకు, అతిచిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతడి ముగ్గురు కొడుకులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఒక కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు. అంతేకాదు, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను చెల్లించి ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.
Read Also- H1B Visa Fee: హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో ట్రంప్ సర్కార్ ఊహించని గుడ్‌న్యూస్!
రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ‘పోలీస్ ఫ్లాగ్ డే’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని ఆయన సందేశమిచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయబోడని కొనియాడారు. ‘‘ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతిఏడాది ‘అక్టోబరు 21’న ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (Police Flag Day) ఘనంగా నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
Read Also- Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్సే లేదు? ఎందుకంటే?
33 మంది పోలీసులకు గాజులరామారంలో స్థలం
2008 జూన్ 29న ఒడిశాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ అవలంభిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందన్నారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమని మెచ్చుకున్నారు. ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని మెచ్చుకున్నారు.
దేశవ్యాప్తంగా 191 మంది.. రాష్ట్రంలో ఆరుగురు
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గ్రేహౌండ్స్ కమాండోలు టీ. సందీప్, వీ.శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్‌లు సంఘవిద్రోహక శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారని ప్రస్తావించారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్‌లాల్, నల్గొండ కానిస్టేబుల్ బీ.సైదులు విధినిర్వహణలో మరణించారని తెలిపారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని కొనియాడారు. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
