Farooq Abdullah: జమ్మూ కశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్ర సంబంధాలు ఉన్న వైద్యులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై స్పందిస్తూ, ఆ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కారణాలను పరిశోధించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్లు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కారణం ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపడంతో పాటు, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడుల నేపథ్యంలో మరో ఆపరేషన్ సింధూర్ జరిగే అవకాశం ఉంటుందేమోనని ఫరూక్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఆపరేషన్ సింధూర్ లాంటిది జరగకూడదని తాను ఆశిస్తున్నానని, ఆపరేషన్ సిందూర్ వల్ల ఏమీ రాలేదని ఆయన పేర్కొన్నారు. మనవాళ్లు 18 మంది మరణించారని పేర్కొన్నారు. రెండు దేశాలు (భారత్, పాకిస్థాన్) తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను ఆశిస్తున్నానని, అదొక్కటే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. స్నేహితులను మార్చవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేమంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలను తాను పునరావృతం చేయాలనుకుంటున్నానని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
Read Also- Miryalaguda: రైతన్నకు దిక్కేది.. తరుగు పేరిట వేల కోట్లు దండుకుంటున్న మిల్లర్లు
శ్రీనగర్ పేలుడుపై స్పందన
శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు పేలిపోయి 9 మంది మరణించిన విషాద ఘటనపై కూడా ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. అధికారులు పేలుడు పదార్థాలను సరిగా నిర్వహించలేదని ఆయన విమర్శించారు. ‘‘ఇది మనం చేసుకున్న తప్పు. పేలుడు పదార్థాల గురించి అవగాహన ఉన్నవారు వాటిని ఎలా నిర్వహించాలో అధికారులతో మాట్లాడి ఉండాల్సింది. అలా చేయకుండా వారే స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నించారు’’ అని అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. జరిగిన నష్టాన్ని అందరూ చూశారని, 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అక్కడ ఇళ్లకు చాలా నష్టం జరిగిందన్నారు. ఢిల్లీలో ప్రతీ కాశ్మీరీ వైపు వేళ్లు చూపిస్తున్న పేలుడు సంక్షోభం నుండి తాము ఇంకా బయటపడలేదని, తాము భారతీయులమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also- KCR: స్థానికంపై దృష్టి సారించండి.. గెలుపోటములు సహజం..కేటీఆర్‌ను అభినందించిన కేసీఆర్
మరోవైపు, శ్రీనగర్‌లోని నౌగామ్‌లోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి పేలుడు ఘటనపై జమ్మూ కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ శనివారం స్పందించారు. పేలుడు జరిగినప్పుడు నిర్దేశిత ఫోరెన్సిక్ విధానం ప్రకారం పేలుడు పదార్థాలను తనిఖీ చేస్తున్నామని, ఈ సంఘటనపై ఊహాగానాలు అనవసరమని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా, కొన్ని రోజుల క్రితం హర్యానాలో వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్‌పై జరిగిన దాడుల తర్వాత సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న తర్వాత, వైద్యులలో ఒకరైన ఉమర్ మొహమ్మద్, పోలీసు చర్యను చూసి భయపడిపోయాడు. హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు పదార్థాలను నింపుకొని, ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది మరణించారు. 25 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే.
