Muda case: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు సీనియర్ అధికారులు అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ముడా కుంభకోణం కేసులో (Mysore Urban Development Authority) కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో 92 స్థిరాస్తులను ఈడీ (ED) తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారుగా రూ.100 కోట్లు ఉంటుందని మంగళవారం వెల్లడించింది . పీఎంఎల్ఏ-2002 నిబంధనల ప్రకారం జూన్ 9న (సోమవారం) అటాచ్ చేసినట్టు తెలిపింది. కేసు విచారణలో భాగంగా ఆస్తుల అటాచ్‌మెంట్ చర్యలు తీసుకున్నట్టు వివరించింది.
ఇప్పుడు అటాచ్ చేసిన ఆస్తులతో కలుపుకొని మొత్తం రూ.400 కోట్ల విలువైన స్థిరాస్తులను ముడా కేసులో అటాచ్ చేసినట్టు వెల్లడించింది. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలు, ముడా అధికారులతో పాటు ప్రభావవంత వ్యక్తులకు డమ్మీలుగా వ్యవహరించిన వ్యక్తుల పేర్ల మీద ఈ ఆస్తులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయని వెల్లడించింది. తాజా చర్యలకు ముందు 160 ముడా స్థలాలను అటాచ్ చేశామని, వాటి విలువ దగ్గరదగ్గరగా రూ.300 కోట్లు ఉంటుందని పేర్కొంది. మొత్తం కలిపి ముడా కుంభకోణం కేసులో ఇప్పటివరకు రూ.400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని వివరించింది. భారత శిక్షాస్మృతి-1860లోని పలు సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం-1988 కింద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కుంభకోణం దర్యాప్తు చేపట్టినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించింది.
Read this- Lover Twist: ప్రియురాలి కోసం ఇంట్లో చేయకూడని పని.. తల్లిదండ్రుల లబోదిబో
ఏంటీ కుంభకోణం?
ముడా (మైసూర్ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఇంటి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఎంతో విలువైన స్థలాలను కాజేసేందుకు నిబంధనలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసపూరిత పద్ధతుల్లో కేటాయింపులు చేసినట్టు తేలింది. అనర్హులైన వ్యక్తులు, సంస్థలకు స్థలాలను అక్రమమార్గంలో కట్టబెట్టడంతో ముడా మాజీ కమిషనర్ జీటీ దినేష్ కుమార్‌తో పాటు పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వెలువడ్డాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్రమ కేటాయింపులకు బదులుగా నగదు రూపంలో, బ్యాంకు ట్రాన్సాక్షన్లు ద్వారా, స్థిర, చరాస్తుల రూపాల్లో లంచాలు పొందారని ఈడీ ఆధారాలు సేకరించింది. ఫేక్ డాక్యుమెంట్లు, సరిగ్గా లేని ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి అనర్హులకు స్థలాలు కేటాయించారని తెలిపింది. ఇందుకోసం గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా లేఖలు కూడా సృష్టించినట్టు గుర్తించింది.
Read this- Honeymoon Case: భర్తను చంపేశాక.. వెలుగులోకి ‘సోనమ్’ క్రిమినల్ ఆలోచనలు
లంచాల రూపంలో పొందిన డబ్బును ఒక సహకార సంఘానికి, కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల బంధువులు, తోటి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఆ డబ్బుతో ముడా స్థలాలను కొనడానికి ఉపయోగించారని ఈడీ వివరించింది. దీంతో, ముడా నివాస స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు ఈడీ విచారణ జరుపుతోంది.
సీఎంపై తీవ్ర అభియోగాలు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగం చేశారంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు, విధానాలను తుంగలో తొక్కారని, సిద్ధరామయ్య కుటుంబ సభ్యులతో పాటు ఎంపిక చేసిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆయన వ్యవహరించారంటూ అభియోగాలు నమోదయ్యాయి. సిద్ధరామయ్య భార్య పేరిట కూడా స్థలాలను కేటాయించగా, తీవ్ర దుమారం రేగింది. అయితే, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని వివరణ ఇస్తూ ఆ స్థలాలను సిద్ధరామయ్య భార్య ఇప్పటికే తిరిగి ముడాకు అప్పగించారు.