Indo – Pak border: భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుమానస్పదంగా సరిహద్దు దాటి ఎవరైనా తమ భూభాగంలోకి ప్రవేశిస్తే సైనికులు చాలా తీవ్రస్థాయిలో ప్రతి స్పందిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ లోని జలంధర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. డ్రగ్స్ మత్తులో పొరపాటున పాకిస్థాన్ లోకి ప్రవేశించాడు. తద్వారా పాక్ రేంజర్లకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
జలంధర్ జిల్లా (Jalandhar District) భోయ్‌పూర్ గ్రామానికి (Bhoypur village) చెందిన శరణ్‌జిత్ సింగ్ (Sharanjit Singh) నవంబర్ 2న పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. షాహ్‌కోట్ డీఎస్పీ సుఖ్‌పాల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం శరణ్‌జీత్ కుటుంబం నవంబర్ 7న అతడు కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. అయితే కొన్ని వారాల తర్వాత శరణ్‌జీత్ ఎక్కడ ఉన్నాడన్న విషయం కుటుంబానికి తెలిసింది. పాకిస్థానీ రేంజర్లు అతడిని హ్యాండ్‌కఫ్స్ వేసి నిర్బంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
డ్రగ్స్ మత్తులో బోర్డర్ దాటేసి..
నవంబర్ 2 సాయంత్రం తమ బిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు శరణ్ జిత్ సింగ్ తల్లిదండ్రులు చెప్పారు. అతని స్నేహితుడు మందీప్, పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేమ్‌కరణ్ వద్ద శరణ్ జిత్ ను వదిలేసినట్లు తెలిపారు. తొలుత శరణ్‌జీత్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు మందీప్‌ను సంప్రదించారు. తమ కొడుకు గురించి ప్రశ్నించారు. తొలుత తనకు తెలియదంటూ అబద్దాలు చెప్పుకుంటూ వచ్చిన అతడి స్నేహితుడు.. చివరికీ జరిగిన విషయం చెప్పాడు. శరణ్ జిత్ ను పాక్ సరిహద్దుకు 4 కి.మీ దూరంలో విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. అయితే శరణ్ జిత్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఘటన జరిగిన రోజు కూడా అతడు మత్తులోనే ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మత్తులో సరిహద్దు దాటినట్లు అభిప్రాయపడ్డారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో ఘనత.. ఏపీకి జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్
కేంద్రం సాయం కోరిన పేరెంట్స్
షాహ్‌కోట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బాల్విందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7న మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ను పోలీసులు సంప్రదించారు. శరణ్‌జీత్ గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో అతడు సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లినట్లు జవాన్లు నిర్ధారించారు. కాగా శరణ్‌జీత్ గత 10 సంవత్సరాలుగా కుస్తీ పహల్వాన్‌గా ఉన్నాడని అతని కుటుంబం తెలిపింది. అయితే 2024లో అతడు మత్తుపదార్థాలకు బానిసయ్యాడని పేర్కొంది. మత్తుకు అలవాటుపడి కుటుంబ సభ్యుల మాట వినకపోవడం, వారితో గొడవపడటం వంటివి చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని పెద్ద అన్న గత ఎనిమిదేళ్లుగా అమెరికాలో నివసిస్తుండగా, అతని చెల్లి పంజాబ్‌లో స్టూడెంట్ గా చదువుకుంటోంది. ఓ గొడవకు సంబంధించి శరణ్ జిత్ పై ఓ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, తమ బిడ్డను పాక్ చెర నుంచి విడిపించాలని శరణ్ జిత్ తల్లిదండ్రులు కేంద్రాన్ని వేడుకుంటున్నారు.

