Delhi Blast Probe: గత సోమవారం దేశరాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి (Delhi Blast Probe) పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ మొహమ్మద్ ఉమర్ (Mohammad Umar), దాడికి ముందు ఎక్కడెక్కడ తిరిగాడనే సమాచారాన్ని దర్యాప్తు ఏజెన్సీల అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్ 10న పేలుడు జరగగా, ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు హర్యానాలోని నూహ్ పట్టణంలో ఒక రూమ్‌ను అద్దెకు తీసుకొని, అందులో ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
అతడి కదలికలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు గత ఐదు రోజులుగా నూహ్‌లో సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఉమర్ గదిని అద్దెకు తీసుకున్న హిదాయత్ కాలనీలో ప్రత్యేకంగా ఒక పోలీసు బృందాన్ని రంగంలోకి దించారు. పేలుడుకు పాల్పడటానికి సుమారు 10 రోజుల ముందు ఉమర్ ఆ కాలనీలో అద్దె గదిలో బస చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పేలుడు జరిగిన రోజే అద్దె గదిని ఖాళీ చేశాడని, తన ఐ20 కారులో పేలుడు పదార్థాలతో అక్కడి నుంచే బయలుదేరి ఉంటాడని భావిస్తున్నారు. నూహ్‌లోని ఒక డయాగ్నస్టిక్స్ సెంటర్‌లో సీసీటీవీ కెమెరాలలో పరిశీలించగా, ఉమర్ కారు కాలనీలోకి ప్రవేశించడం రికార్డ్ అయ్యిందని అధికారులు తెలిపారు. అయితే, కాలనీ నుంచి కారు ఎప్పుడు బయటకు వెళ్లింది, ఉగ్రవాది ఏ రూట్‌లో వెళ్లాడనేది మాత్రం ఇంకా గుర్తించలేదు.
Read Also- Kolkata Test: కోల్‌కతా టెస్టులో భారత్ ఓటమి.. దక్షిణాఫ్రికా ఉత్కంఠభరిత విజయం
నూహ్ పేరుకు హర్యానాలోనే ఉన్నప్పటికీ, దేశరాజధాని ఢిల్లీ ప్రాంతానికి అనుకొని ఉంటుంది. అంటే, దాదాపుగా ఢిల్లీలో ఉన్నట్టే లెక్క. మొహమ్మద్ ఉమర్ బస చేసిన కాలనీ ఢిల్లీ-అల్వార్ రోడ్‌లో ఉంది. ఇక, ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని, ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే షోయబ్‌కు బావమరిది అవుతాడు. మొహమ్మద్ ఉమర్‌కు వసతి కల్పించిన యజమానిని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఉమర్ అద్దెకు దిగి, అక్కడ నివసిస్తున్న విషయం ఇరుగుపొరుగు వారికి గానీ, నూహ్‌లోనే ఉన్న ఇంటెలిజెన్స్ యూనిట్‌కు కూడా తెలియదని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉమర్ నూహ్‌లో ఉన్నట్లు గతంలో రికార్డైన రెండు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణ అయింది. ఒక ఫుటేజీలో అతడు ఫిరోజ్‌పూర్ జిర్కాలోని టోల్ ప్లాజాను దాటుతున్నాడు. మరో ఫుటేజీలో బివాన్-పహాడి రోడ్‌లో ఉన్న ఓ ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. నూహ్‌లో ఉన్న సమయంలో తన అల్ ఫలా కాలేజీకి చెందిన కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులను కలిసి ఉండవచ్చునని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also- Bihar Cabinet: బీహార్‌లో ఖరారైన ‘కేబినెట్ ఫార్ములా’!.. సీఎం ఎవరంటే?
కాగా, మొహమ్మద్ ఉమర్‌తో కలిసి పనిచేసిన ముగ్గురు డాక్టర్లు షాహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్, ఆదిల్ రథర్ కూడా ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాలను గుర్తించిన తర్వాత ఈ ఉగ్ర లింకులు బయటపడ్డాయి. అనుమానిత డాక్టర్లు అద్దెకు తీసుకున్న ఇళ్ల నుంచి పోలీసులు సుమారుగా 3,000 కిలోల పేలుడు పదార్థాలు, బాంబు తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సయీద్ కారులో ఒక రైఫిల్, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి.
