Delhi Blast : ఢిల్లీ నగరాన్ని కుదిపేసిన రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటనకు సంబంధించిన కొత్త సీసీటీవీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజ్‌లో, వైట్ కలర్ హ్యూండాయ్ i20 కారు రద్దీగా ఉన్న రోడ్డుపై నెమ్మదిగా కదులుతూ వెళ్లుతుండగా ఒక్కసారిగా భయంకరంగా పేలిపోవడం కనిపిస్తుంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఇందులో తొమ్మిది మంది మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు.
ఈ సీసీటీవీ ఫుటేజ్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలోని ట్రాఫిక్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం, సోమవారం సాయంత్రం 6:52 గంటలకు కారులు, ఆటోరిక్షాలు, ఇతర వాహనాలు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో సమీపంలోని వాహనాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటన తర్వాత కొద్ది నిమిషాల్లోనే అత్యవసర సేవా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, కారు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు, మరో పన్నెండు మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
NIA విచారణలో విస్తుపోయే నిజాలు
ఈ ఘటనను ప్రభుత్వం “దారుణ ఉగ్రవాద చర్య”గా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా కేసు బాధ్యతలు స్వీకరించింది. దర్యాప్తులో, పేలిన వాహనం HR 26CE7674 నంబర్ గల వైట్ కలర్ హ్యూండాయ్ i20 అని నిర్ధారించారు. ఈ కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ (32) అనే వైద్యుడు అని అధికారులు చెబుతున్నారు. ఆయన పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM) తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది.
ఫరీదాబాద్‌లో కొనుగోలు చేసిన కారు
సమాచారం ప్రకారం, డాక్టర్ నబీ అక్టోబర్ 29న ఫరీదాబాద్‌కు చెందిన కార్ డీలర్ సోనూ వద్ద ఈ i20ను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన కొద్ది సేపటికే అతను అదే ప్రాంతంలోని రాయల్ కార్ జోన్ సమీపంలోని PUC బూత్ వద్ద సర్టిఫికేట్ తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. తర్వాత అతను కారు తీసుకుని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్ వద్దకు వెళ్లి అక్కడ డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కార్ పక్కన పార్క్ చేశాడు. గమనార్హంగా, షకీల్ వద్ద నుండి 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో అతను ఇప్పటికే అరెస్టయ్యాడు.
సీసీటీవీ ఫుటేజ్‌లో భయానక దృశ్యాలు
సీసీటీవీ ఆధారాల ప్రకారం, ఈ హ్యూండాయ్ i20 ఢిల్లీలోని కనాట్ ప్లేస్, మయూర్ విహార్ ప్రాంతాల మీదుగా ప్రయాణించి, చాంద్నీ చౌక్‌లోని సునెహ్రీ మస్జిద్ పార్కింగ్ లాట్ వద్ద మధ్యాహ్నం 3:19 గంటలకు నిలిపినట్లు గుర్తించారు. ఆ సమయంలో డాక్టర్ నబీగా భావిస్తున్న వ్యక్తి కారు విండోపై చేయి ఉంచి కనిపించాడు. ఆ కారు మూడు గంటలకుపైగా అక్కడే నిలిచి ఉండి సాయంత్రం నెహ్రూ సుబాష్ మార్గ్ వైపు కదిలి వెళ్లింది. ఆ తర్వాతే పేలుడు సంభవించింది.
