Delhi HC Judge Case: ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) ఇంట్లో ఇటీవల పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇది నిజమేనని సుప్రీంకోర్టు (Supreme Court) ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల పానెల్ నిర్ధారించింది. ఈ మేరకు 64 పేజీల నివేదికను తయారు చేసింది. ప్రత్యక్ష సాక్షులతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మ స్టేట్ మెంట్ ను సైతం రికార్డ్ చేసి నివేదికలో పొందుపరించింది. ఈ నివేదికకు సంబంధించి పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.
55 మంది సాక్షుల విచారణ
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తేల్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 30 తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలను గుర్తించడం జరిగిందని నివేదికలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా మెుత్తం 55 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా రూపొందించిన నివేదికను తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి సమర్పించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
జస్టిస్ వర్మపై ఆరోపణలు నిజమే
ప్యానెల్ నివేదికకు సంబంధించిన 60వ పేజీలో డబ్బు లేదా నగదును న్యాయమూర్తి ఇంట్లోని స్టోర్ రూమ్ (Store Room) లో కనుగొనడం జరిగిందని పేర్కొంది. ఆ స్టోర్ రూమ్ లోకి ప్రవేశం జస్టిస్ వర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉందని 59వ పేజీలో పేర్కొన్నట్లు సమాచారం. జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు స్టోర్ రూమ్ లోకి ప్రవేశించే అవకాశమే లేదని రాసుకొచ్చింది. మార్చి 14న అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పుతున్న క్రమంలో సగం కాలిన కరెన్సీ నోట్లు కనిపించాయని ప్యానెల్ నివేదిక ధ్రువీకరించింది. అంతేకాదు కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మెుత్తం కాదని వెల్లడించింది. తమకు దొరికిన ఎలక్ట్రానిక్, ప్రత్యక్ష ఆధారాలను దృష్టిలో ఉంచుకొని జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలుతోందని నివేదిక పేర్కొంది.
Also Read: SpiceJet flight: హైదరాబాద్ – తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య.. ఫ్లైట్‌లో 80 మంది ప్రయాణికులు!
ప్రత్యక్ష సాక్షి కీలక వ్యాఖ్యలు
జస్టిస్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గదిలోకి వెళ్లినప్పుడు అక్కడ కుడివైపు నేలపై రూ.500 నోట్ల కట్టలు భారీగా పడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అది చూసి తాను షాకయ్యానని.. తన జీవితంలో నేలపై అంతమెుత్తం సొమ్ము పడి ఉండటాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు డబ్బు విషయం బయటకు చెప్పవద్దని అగ్నిమాపక సిబ్బందిని జస్టిస్ వర్మ కుమార్తె దియా, ఆయన ప్రైవేటు కార్యదర్శి రాజేందర్ సింగ్ కార్కి బెదిరించినట్లు ఆరోపణలు రాగా.. కమిటీ ఈ అంశాన్ని నివేదికలో ప్రస్తావించింది. ఈ విషయమై రాజేందర్ సింగ్ ను ప్రశ్నించగా.. ఆ ఆరోపణలను తిరస్కరించారని నివేదిక పేర్కొంది.