Delhi Explosion: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు (Delhi explosion) సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి ఉన్న కారులో ఈ పేలుడు సంభవించడంతో.. పక్కనే ఉన్న ఐదు కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనపై తాజాగా దిల్లీ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ బ్లాస్ట్ సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో జరిగినట్లుగా తెలిపారు. ఒక వాహనం నెమ్మదిగా వచ్చి, రెడ్ లైట్ దగ్గర ఆగిందని, కారు ఆగుతుండగానే బ్లాస్ట్ సంభవించిందని తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడుతున్నామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, ఎక్కువ మంది గాయపడినట్లుగా సీపీ చెప్పుకొచ్చారు.
Also Read- Delhi Car Blast: దిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్.. గాల్లోకి ఎగిరిపడ్డ మృతదేహాలు
దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్ అమిత్ షా
ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. హోం మినిస్టర్ అమిత్ షా (Amit Shah)కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ (Narendra Modi).. సహయక చర్యలు, పేలుడు ఎలా జరిగిందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై హోం మినిస్టర్ అమిత్ షా దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎర్రకోట వద్ద ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు జరిగింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు మృతి చెందారు. పేలుడు జరిగిన 10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌ను ఆరా తీస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక రాగానే.. ప్రజల ముందు ఉంచుతామని అమిష్ షా తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
సంఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్ల తరలించారు. క్షతగాత్రులను ఎల్ఎన్జెపీ (లోకనాయక్ ఆసుపత్రి) ఆసుపత్రికి తరలిస్తున్నారు. పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి పోలీసులు అనుమతించడం లేదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి నిపుణులు శాంపిల్స్ సేకరిస్తున్నట్లుగా సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
