Mahila Samriddhi Yojana: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. ఉమెన్స్ డే సందర్భంగా మహిళకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీలో ఒకటైన ‘మహిళా సమృద్ధి యోజన’ (Mahila Samriddhi Yojana) పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఢిల్లీ అర్హత కలిగిన ప్రతీ మహిళకు రూ.2,500 అందించనున్నారు.
రూ.5,100 కోట్లు కేటాయింపు
ఢిల్లీ ఎన్నికల సమయంలో అధికార బీజేపీ పలు హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యమైన హామీ ‘మహిళా సమృద్ధి యోజన’. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ కింద ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామని బీజేపీ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా అధికారంలో వచ్చిన కమలం పార్టీ.. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని క్యాబినేట్ ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.
#WATCH | Delhi | Union Minister and BJP National President JP Nadda says, "…Today, I am happy, and I congratulate CM Rekha Gupta and others that for Mahila Samriddhi Yojan, they have allocated Rs 5100 crore to implement it in Delhi…" pic.twitter.com/gryn3NDNEX
— ANI (@ANI) March 8, 2025
బీజేపీపై ఆప్ విమర్శలు
‘మహిళా సమృద్ధి యోజన’ పథకానికి సంబంధించి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ ముఖ్యనేత అతిశీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా మార్చి 8న ఈ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ రోజు రానే వచ్చిందని, ఖాతాల్లో డబ్బులు పడతాయని మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూశారని పేర్కొన్నారు. అయితే అదంతా ‘జుమ్లా’ (అబద్దపు హామీ) అని నిరూపితమైందని ఆమె విమర్శించారు. డబ్బులు విషయం పక్కన పెడితే కనీసం లబ్దిదారుల నమోదు ప్రక్రియ, పథకానికి సంబంధించి పోర్టల్ కూడా రెడీ కాలేదని అన్నారు.