Rohith-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) ..వన్డే ఫార్మాట్ లో తిరుగులేని బ్యాటర్..ఈ ఫార్మాట్ లో అతనెంత ప్రమాదకారో చెప్పేందుకు 264 పరుగుల అతని భారీ ఇన్నింగ్స్ చాలు..అంతేకాదు పవర్ ప్లేలో అతని ఆటతీరు అద్భుతహా.. ఇక కింగ్ కోహ్లీ.. వన్డే ఫార్మాట్ లో అతని రికార్డులు ఘనం. ఇక ఛేజింగ్ లో కోహ్లీ(Kohli)ని అడ్డుకోవడమంటే సముద్రంలో సునామీకి ఎదురువెళ్లడమే.. గత దశాబ్దకాలంగా వీరిద్దరూ ఈ ఫార్మాట్ లో భారత్ కు తిరుగేలని ఆధిపత్యం అందించారు.
కాగా, 2020 నుంచి వీరిద్దరి మధ్య ఒక పెద్ద భాగస్వామ్యం(Partnership) రాలేదు. గత ఐదేండ్లలో వన్డేల్లో వీరిద్దరి భాగస్వామ్యంలో 436 పరుగులు మాత్రమే జోడించారు. అంటే వన్డేలు ఆడడం తగ్గిన మిగిలిన బ్యాటర్లతో వీరిద్దరూ కలిసి అద్భుత భాగస్వామ్యాలు జోడిస్తున్నారు. కేవలం వీరిద్దరూ కలసి క్రీజులో నిలబడి భాగస్వామ్యం నమోదు చేయడం లేదు.
ఈ ఐదేండ్ల కాలంలో రోహిత్ …శుభ్ మన్ గిల్ (Gill)తో కలిసి 2019 పరుగుల భాగస్వామ్యం అందించగా.. ఇదే గిల్ తో కలిసి కోహ్లీ 913 పరుగులను కోహ్లీ జోడించడం విశేషం. అంతేకాదు షార్ట్ పీరియడ్ లోనే శ్రేయస్ అయ్యర్ (Iyer) తో కలిసి 1181 పరుగుల భాగస్వామ్యాలు అందించగా.. ఇక కేఎల్ రాహుల్(KL Rahul) తోనూ 913 పరుగుల భాగస్వామ్యాలను కోహ్లీ అందించడం విశేషం. కాగా, రోహిత్ పవర్ ప్లేలో ధనాధన్ షాట్లకు వెళుతూ చాలాసార్లు కోహ్లీ రాకముందే అవుట్ కావడం.. లేదంటే కోహ్లీ రాగానే వెంటనే పెవిలియన్ చేరడం జరుగుతోంది.
Also Read- Steven Smith: భారత్ తో ఓటమి ఎఫెక్ట్.. ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం
అదే రోహిత్ కనీసం 60 లేదా 70 బంతుల పాటు క్రీజులో ఉంటే అతని బ్యాట్ మంత్రదండంలా మారుతుంది. కొడితే ఫోర్ లేదంటే సిక్సర్ అన్నంతగా విధ్వంసం సృష్టిస్తాడు. అందుకే కదా అతన్ని హిట్ మ్యాన్ (Hitman)అంటారు. రోహిత్ తో పోల్చుకుంటే కోహ్లీ ఆటతీరు మిడిలార్డర్ కు అతికినట్లుగా సరిపోతుంది. ఇటుకఇటుక పేర్చి ఇల్లు కట్టినట్లుగా కోహ్లీ పరుగులు సాధిస్తాడు. కానీ వీరిద్దరూ కలిసి క్రీజులో చెలరేగితే మన జట్టు దరిదాపుల్లోకి ఓటమన్నదే రాదు. కానీ గత ఐదేండ్లుగా వీరిమధ్య సరైన భాగస్వామ్యం నమోదు కావడం లేదు.
మరి తాజాగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి 2.5 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. రోహిత్ 10 బంతుల్లో 7 పరుగులు చేయగా.. కోహ్లీ 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు. అదే గతంలో అంటే 2020 వరకు వీరి భాగస్వామ్యంలో 4878 పరుగులు వచ్చాయి. టీమిండియా సాధించిన పరుగుల్లో వీరి భాగస్వామ్యం సగటు 65.04 కాగా.. భారత దిగ్గజ ఓపెనర్లు సచిన్(Sachi), గంగూలీ (Ganguly)మాత్రమే వీరిద్దరి కంటే అత్యధిక భాగస్వామ్యాలు అందించిన ఘనత సాధించినా ..వీరి సగటు 47.55 మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో రోహిత్, కోహ్లీ కలిసి 176 వన్డేల్లో ఆడగా.. వీరిద్దరూ కలిసి భాగస్వామ్యాలు నమోదు చేసింది 80 సార్లు మాత్రమే కావడం విశేషం.
అందుకే కెరీర్ చరమాంకంలో ఉన్న వీరిద్దరూ కలిసి మళ్లీ ఒక భాగస్వామ్యం అందించాలి. ఐసీసీ(ICC) టోర్నీల్లో మనకు కొరకరాని కొయ్యలా మారిన కివీస్ ను కట్టడి చేయాలంటే ఇది అత్యవసరం. అంతేకాదు వన్డే క్రికెట్ కు ఎంతో సేవ చేసిన వీరిద్దరూ ఆటను మరింత ఉన్నత స్థాయికి చేర్చాలన్నా వీరిద్దరూ కలిసి క్రీజులో నిలవాల్సిందే. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య ఆట సాగితే.. వీరిద్దరూ క్రీజులో ఉంటే.. పరుగుల సునామీ రాక తప్పదు. వీరిద్దరూ కలిసి కదం తొక్కితే చాంపియన్స్ ట్రోఫీలో సునాయాస విజయం మనకు తథ్యం..