Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలో (Delhi Blast) ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని భావిస్తున్న అనుమానిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఉమర్ నబీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. పేలుడుకు ముందు అతడు ఏం చేశాడనే వివరాలు సేకరిస్తున్న దర్యాప్తు బృందాలు పలు కీలక వివరాలు రాబట్టాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలను ఉగ్రవాద నిరోధక సంస్థలు స్వాధీనం చేసుకోవడం, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమిల్ అనే ఇద్దరు వైద్యులను ప్రశ్నిస్తున్నారన్న విషయం తెలుసుకొని మొహమ్మద్ ఉమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పేలుడుకు మూడు రోజుల ముందు అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు.
Read Also- Huzurabad: విద్యార్థులతో ధ్యాన మహాయజ్ఞం.. ఏకాగ్రత కోసం ధ్యానం నిత్యకృత్యం కావాలి : కమిషనర్ సమ్మయ్య
తన ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, కుటుంబ సభ్యులు కూడా అతడిని సంప్రదించలేకపోయారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబర్‌గా మారాడంటే జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న కొయల్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పేలుడు జరిగిన సోమవారం రాత్రే కొయల్ గ్రామానికి వెళ్లిన పోలీసులు ఉమర్ ఇంటిని సోదా చేశారు. అతడి తల్లి, ఇద్దరు సోదరులను అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి శరీర నమూనాలతో సరిపోల్చడానికి తల్లి డీఎన్ఏ నమూనాలను సేకరించినట్టు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఉమర్ తండ్రిని కూడా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి డీఎన్ఏ శాంపుల్స్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. నిజానికి సోమవారమే ఉమర్ తండ్రిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ, అతడి మానసిక పరిస్థితి కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు.
గతంలో పేషెంట్ మృతికి కారకుడు
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో మొహమ్మద్ ఉమర్ నబీ పేరు బయటకు వచ్చినప్పుడు, అతడి గురించి తెలిసివారు తొలుత నమ్మలేకపోయారు. కానీ, ఈ వార్తలు చూసిన ఒక రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్ మాత్రం ఆశ్చర్యపోలేదు. మొహమ్మద్ ప్రవర్తన గురించి తెలిసిన ఆయన, తనకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదని అంటున్నారు. నబీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో 2023లోనే ఆయన గుర్తించారట. అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగం నుంచి ఉమర్ నబీని తొలగించాలంటూ సిఫార్సు చేసిన నలుగురిలో ఒకరైన ప్రొఫెసర్ డాక్టర్ గులాం జీలానీ రోమ్‌షూ ఈ విషయాలు చెప్పారు. ఒక రోగి మరణానికి కారకుడు కావడంతో తొలగించాలని సిఫార్సు చేశామన్నారు. ఈ ఘటన 2023లో జరిగిందని, శ్రీనగర్‌లో ఎంబీబీఎస్, ఎండీ డిగ్రీలు పూర్తి చేసిన నబీ, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్‌గా చేశారని ఆయన గుర్తుచేశారు. మూడేళ్ల రెసిడెన్సీ ప్రోగ్రామ్ కోసం అనంత్‌నాగ్‌కు వచ్చాడని, అక్కడ జనరల్ మెడిసిన్ విభాగంలో తాను అధికారిగా ఉన్నానంటూ జీలానీ గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేషెంట్ మరణానికి నబీ నిర్లక్ష్యమే కారణమని రుజువైందన్నారు. క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న ఆ రోగి నబీ పర్యవేక్షణలో ఉన్నాడని, కానీ ఒక రోజంతా, డాక్టర్ నబీ డ్యూటీలో లేకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని, పేషెంట్‌ని చూసుకోలేదని చెప్పారు. దీంతో, రోగి పరిస్థితి మరింత దిగజారిందని, డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ రోగిని కాపాడేందుకు ప్రయత్నించినా, విఫలమయ్యి ఆ రోగి మరణించినట్టు వివరించారు. ఈ ఘటనలో మొహమ్మద్ నబీపై పేషెంట్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారని, దర్యాప్తునకు డాక్టర్ జీలానీతో పాటు నలుగురు సీనియర్ డాక్టర్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు.
