Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ ఆయుధాలు, పేలుడు పదార్థాల సేకరణకు సంబంధించిన గుట్టురట్టయ్యింది. ఆయుధాలను సమకూర్చుకోవడంలో అరెస్టయిన నలుగురు వైద్యులే కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుడు ప్రణాళిక, అమలులో డాక్టర్ ముజమ్మిల్(Dr. Muzammil), డాక్టర్ షాహీన్(Dr. Shaheen), డాక్టర్ అదీల్(Dr. Adeel), అమీర్ కీలక పాత్ర పోషించినట్లు ‘సెంటర్ కౌంటర్-టెర్రర్ ఏజెన్సీ’ గుర్తించింది. సహచర వైద్యులతో ‘మేడమ్ సర్జన్’ అని పిలిపించుకున్న లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ కూడా ఆయుధాల సేకరణలో కీలక పాత్ర పోషించింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించడమే కాకుండా, రష్యన్ అసాల్ట్ రైఫిల్స్, డీప్ ఫ్రీజర్‌ను ఆమె సమకూర్చిందని దర్యాప్తు అధికారుల తేల్చారు. షాహీన్‌కు పరిచయస్తుడైన ఓ వ్యక్తి ఇచ్చిన రూ.5 లక్షలతో డాక్టర్ ముజమ్మిల్ రష్యన్ అసాల్ట్ రైఫిల్‌ను కొన్నాడని గుర్తించారు. ఆ ఏకే-47 రైఫిల్‌ను డాక్టర్ అదీల్‌కు సంబంధించిన ఒక లాకర్‌లో దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రర్ మాడ్యూల్ ఆయుధాల సేకరణ నెట్‌వర్క్‌ను గుర్తించడంలో ఈ ఆయుధం ఉపయోగపడింది. ఫరీదాబాద్‌లో ఈ నలుగురు డాక్టర్ల నుంచి ఇదివరకే మరో రష్యన్ ఆరిజిన్ రైఫిల్, చైనీస్ పిస్టల్, బెరెట్టా పిస్టల్, దాదాపు 2,900 కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం రూ.26 లక్షలు సమీకరణ
ఉగ్రవాద నిందిత డాక్టర్లు మొత్తం కలిపి రూ.26 లక్షలు సేకరించారు. ఇందులో అధిక భాగం మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ ద్వారా సమీకరించారు. పేలుడు ప్లాన్ కోసం ఆమె క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్టుగా తెలుస్తోంది. షాహీన్ తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి మహిళలను ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లోకి రిక్రూట్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక, పేలుడుకు పాల్పడ్డ బాంబర్ ఉమర్.. తుర్కియేలో (టర్కీ) ఉన్న హ్యాండ్లర్ల సూచనల మేరకు ఆన్‌లైన్‌లో బాంబు తయారీ ట్యుటోరియల్స్, మాన్యువల్స్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నుహ్‌లోని మార్కెట్లలో రసాయన పదార్థాలు, ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్ నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాలు కొన్నాడు. ఫ్రీజర్‌ను ఉపయోగించి పేలుడు మిశ్రమాన్ని ప్రాసెస్ చేసినట్టు సమాచారం. మరో, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ అనుమానితులకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. 2019 పుల్వామా దాడి సూత్రధారి, జైష్ కమాండర్ ఉమర్ ఫారూఖ్ భార్య ఆఫిరా బీబీతో వీరికి సంబంధాలు ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: Shiva Jyothi Controversy: తిరుమలలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన యాంకర్ శివ జ్యోతి..
ఉగ్రవాదుల నుంచి అద్దె ఇప్పించండి
ఢిల్లీ పేలుడు దర్యాప్తు కేసులో బిజీగా ఉన్న దర్యాప్తు అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అరెస్టయిన ఉగ్రవాద అనుమానిత డాక్టర్ల నుంచి తన అద్దె డబ్బులు ఇప్పించాలంటూ ఇంటి యజమాని ఒకరు కోరారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుమానిత ఉగ్రవాదులు డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్ కొన్ని నెలల పాటు ఢిల్లీ శివారులోని ఫరీదాబాద్‌లో ఒక ఇంట్లో అద్దెకు నివసించినట్లు తేలింది. సాధారణ వ్యక్తులుగా నటించి అద్దెకు దిగారు. అయితే, వీరిద్దరు తనకు మూడు నెలల అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ యజమాని చెప్పాడు. ఆ ఇంటి యజమానిని దర్యాప్తు సంస్థలు ఇదివరకే విచారణకు పిలిచాయి. అయితే, నిందితుల నేర చరిత్ర గురించి తనకు ఏమాత్రం తెలియదని, కానీ వారు నివసించిన మూడు నెలల కాలానికి రావాల్సిన అద్దె బకాయిలను ఎలాగైనా ఇప్పించాలని అధికారులను ఆయన అభ్యర్థించినట్లు తెలిసింది. కాగా, ఉగ్రవాదులు రూ.15 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అయితే, ఇంటి యజమాని అభ్యర్థన విషయంలో న్యాయపరంగా చిక్కులు ఎదురవనున్నాయి. ఉగ్రవాద కేసులలో నిందితులుగా ఉన్నవారి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలన్నీ దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలోకి రావడమే ఇందుకు కారణం. కేసు తీవ్రత సదరు ఇంటి యజమానికి అర్థం కావడం లేదని దర్యాప్తు వర్గాలు చెబుతుండడం గమనార్హం.
Also Read: Vijay Deverakonda: సత్యసాయి బాబాతో తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న విజయ్ దేవరకొండ.. ఫోటో వైరల్..

