MGNREGS Renaming: ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత, ఉపాధి హామీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) గ్రామీణ భారతానికి చాలా గొప్ప పథకం. 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పేరుని మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం(MGNREGS Renaming) భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌కు (Cabinet) ఒక ప్రతిపాదన కూడా అందింది. ప్రతిపాదన ప్రకారం, ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ పథకంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 12) నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
పని దినాలు పెంపు!
పేరు మార్పుతో పాటు, ప్రభుత్వం హామీ ఇచ్చే కనీస పని దినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపును కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు బిల్లులో ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేతన సవరణ చేపట్టి, కనీస రోజువారీ కూలీని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఈ పథకానికి కేటాయిస్తున్న నిధులను కూడా కేంద్రం పెంచనుంది. నిధులను రూ.1.5 లక్షల కోట్లకు పైగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పథకానికి కీలకమైన మార్పులు చేసి, మెరుగులు దిద్దుతున్నందున, దానికి తగ్గట్టుగా పథకానికి కొత్త పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు భావిస్తోంది.
కాగా, తొలుత యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 (NREGA) తీసుకొచ్చింది. ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చింది. పని హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక చట్టం, సామాజిక భద్రతా చర్యగా ఈ పథకం నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబానికి ఉపాధిని కల్పిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన వయోజనులు ఏడాదికి కనీసం 100 రోజులపాటు పనిచేయవచ్చు. కనీస జీతం గ్యారంటీతో జీవనోపాధి భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి.
Read Also- Ozempic Launched: యావత్ ప్రపంచం చర్చించుకుంటున్న ‘ఓజెంపిక్ ఔషధం’ భారత్‌లో విడుదల.. రేటు ఎంతంటే?
పథకం ప్రాముఖ్యత ఇదే
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ వాసులకు చట్టబద్ధంగా ఉపాధిని హామీ ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తుంది. పని కోరిన 15 రోజుల్లోగా ఉపాధిని కల్పించకపోతే, వారికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే, మహిళా సాధికారత కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది. మొత్తం ఉపాధిలో కనీసం మూడింట ఒక వంతు మహిళలకు ఉపాధిని కల్పించాలి. ఇక, ఈ పథకం ద్వారా చెరువులు తవ్వకం, రోడ్ల నిర్మాణం, నీటి సంరక్షణ పనులు వంటి గ్రామీణ మౌలిక వసతులు, శాశ్వత ఆస్తుల సృష్టి జరుగుతుంది.

