CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 నుంచి 12 తరగతుల సిలబస్‌లో సమూల మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ అప్డేటెడ్ సిలబస్ అన్ని అనుబంధ స్కూల్స్‌లో అమలులోకి రానుంది. విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, వారికి మరింత క్రియాశీలమైన, ఆధునిక విద్యా వాతావరణం కల్పించడం ఈ మార్పుల లక్ష్యంగా సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది.
CBSE కొత్త సిలబస్ ప్రకారం 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు గ్రేడింగ్ ప్రమాణాలను సవరించింది. ఇప్పుడు 9 పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని ఉపయోగిస్తోంది. ఇక్కడ మార్కులను గ్రేడ్‌లుగా మారుస్తారు.
10వ తరగతి విద్యార్థులకు బోర్డు ఇప్పుడు మూడు నైపుణ్య ఆధారిత సబ్జెక్టులలో ఒకదాన్ని ఎంచుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదనంగా, విద్యార్థులు తమ భాషా సబ్జెక్టులలో ఇంగ్లీష్ లేదా హిందీని ఒకటిగా ఎంచుకోవాలి. దీనిని వారు 9 లేదా 10వ తరగతిలో తీసుకోవచ్చు.
Also Read: హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్టు.. సీఎం రేవంత్ సమీక్ష
సీబీఎస్ఈ బోర్డు ఈ మార్పులను విద్యా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, విద్యార్థులకు విశాలమైన అధ్యయన అవకాశాలు అందించే దిశగా రూపొందించినట్లు తెలిపింది. ఈ కొత్త సిలబస్ ద్వారా విద్యార్థులు సాంప్రదాయ పాఠ్యాంశాలతో పాటు ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, క్రిటికల్ థింకింగ్ వంటి నైపుణ్యాలను కూడా అభ్యసించే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీబీఎస్ఈ బోర్డు అన్ని అనుబంధ స్కూల్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త సిలబస్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, దానికి తగిన శిక్షణను ఉపాధ్యాయులకు అందించాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించింది. అలాగే, విశాల అధ్యయనం (Holistic Education)పై దృష్టి పెట్టి, విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేలా బోధనా విధానాలను మార్చాలని బోర్డు సూచనలు జారీ చేసింది.
ఈ మార్పులపై విద్యా నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తుంది. సాంకేతికతతో కూడిన విద్యా విధానం దీర్ఘకాలంలో దేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయనుంది.’ అని ఢిల్లీలోని ఓ ప్రముఖ విద్యావేత్త అభిప్రాయపడ్డారు.
అయితే ఈ మార్పులను అమలు చేయడంలో స్కూల్స్‌కు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్‌లో అవగాహన కొరత వంటి అంశాలు సమర్థవంతమైన అమలుకు అడ్డంకులుగా మారవచ్చని వారు పేర్కొంటున్నారు. దీనిపై సీబీఎస్ఈ బోర్డు త్వరలో వివరణాత్మక గైడ్‌లైన్స్, సపోర్ట్ సిస్టమ్‌ను రూపొందించే అవకాశం ఉంది.