BSNL 4G: స్వదేశీ సాంకేతికతతో దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ (BSNL 4G) అందించాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ శనివారం (సెప్టెంబర్ 27) రెండు కీలక ప్రాజెక్టులను మొదలుపెట్టబోతోంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్, డిజిటల్ భారత్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 100 శాతం 4జీ సాచురేషన్ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ‘‘దేశవ్యాప్తంగా దాదాపు 98,000 ప్రదేశాలలో స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం. ఇప్పటికే 4జీ టవర్లు, బేస్ స్టేషన్‌లు (BTS) 2.2 కోట్ల మందికి పైగా సేవలు అందిస్తున్నాయి. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారితంగా, క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా, ఇది సులభంగా 5జీకి అప్‌గ్రేడ్ అవుతుంది’’ అని జ్యోతిరాదిత్య సింధియా వివరించారు.
బీఎస్ఎన్ఎల్ ద్వారా దేశ గ్రామీణ ప్రాంతాలు, సేవలు అందని మారుమూల ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో 4జీ సాచురేషన్ ప్రాజెక్ట్ ఒక భాగమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం కనెక్టివిటీతో మాత్రమే సరిపెట్టుకోకుండా, భారత్‌లోనే టెలికం ఉత్పత్తుల తయారీ అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వ దృష్టి పెడుతుందని జ్యోతిరాధిత్య సిందియా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు సైతం ప్రస్తుతం భారత ఉత్పత్తిదారులతో భాగస్వామ్యం కుదుర్చకుంటున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Read Also- Fan Emotional Video: దేవుడి కోసం సాధించండి.. స్టేడియంలో పాక్ ఫ్యాన్ ఎమోషనల్.. భారత్‌పై ఇంత కసి ఉందా?
టెలికం పరికరాల హబ్‌గా భారత్!
మంత్రి జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడుతూ, భారత్ టెలికం పరికరాల తయారీ హబ్‌గా ఎదుగుతోందని అన్నారు. తాము ఇకపై కేవలం సేవలపై మాత్రమే కాకుండా, పరికరాల తయారీ హబ్‌గానూ ఎదుగుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచం నేడు భారత్‌లో తయారీ రంగంలోకి గణనీయంగా అడుగుపెడుతోంది. సిస్కో కంపెనీ ఇప్పటికే ఫ్లెక్స్, ఎరిక్సన్, వీవీడీఎన్ లాంటి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. డిక్సన్ కూడా ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తోంది. సీ-డాట్ (C-DOT) పాత్ర పెరుగుతోంది. గతంలో కేవలం ప్రధాన సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే అందించిన ఈ కంపెనీ, నేడు తేజస్ నెట్‌వర్క్స్‌తో కలిసి రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN) పరికరాలను కూడా తయారు చేస్తోంది. ఈ పరికరాలకు గ్లోబల్ సౌత్ దేశాలలో మంచి డిమాండ్ ఉంది’’ అని జ్యోతిరాదిత్య సింథియా పేర్కొన్నారు.
ఇక, బీఎస్ఎన్ఎల్ భవిష్యత్ అభివృద్ధిపై మాట్లాడుతూ, సంస్థను మరింత విస్తరించేందుకు, మౌలిక వసతులను ఆధునీకరించేందుకుగానూ ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ప్రణాళిక సిద్ధంగా ఉందని వివరించారు. ఇందుకు అవసరమైన నిధులు బీఎస్ఎన్ఎల్ సొంత ఆదాయాలు, భూముల విక్రయం, కేంద్ర ప్రభుత్వ సహాయం వంటి మార్గాల్లో లభించనున్నాయని చెప్పారు. అయితే, ఇంకా చర్చలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలను వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు.